ఓటు హక్కు విలువైనది : కలెక్టర్​ రాజర్షి షా

ఓటు హక్కు విలువైనది :  కలెక్టర్​ రాజర్షి షా
  •     మెదక్​ కలెక్టర్ రాజర్షి షా

మెదక్​ టౌన్, వెలుగు : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, దానిని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని మెదక్ కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. బుధవారం మెదక్​ పట్టణంలోని డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్​కు ఓటుపై అహగాహన సదస్సు నిర్వహించారు.  ఈ  సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఓటర్ నమోదులో యువత  చైతన్యం కావాలన్నారు. జిల్లాలో 73  ప్రభుత్వ,  ప్రైవేట్ కాలేజీల్లో 15 రోజుల పాటు  ఓటర్ నమోదు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్​ నమోదుకు ఆన్ లైన్, ఆఫ్​లైన్ విధానాల్లో ఓటు నమోదు చేసుకోవచ్చునన్నారు. 18 ఏండ్లు నిండిన 200 మంది స్టూడెంట్స్​ ఫారమ్- 6 పూరించి అక్కడే ఉన్న ఏఈఆర్​వోకు అందజేశారు. అనంతరం డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో కలెక్టర్​ మొక్క నాటారు.  కార్యక్రమంలో జిల్లా సైన్స్​ అధికారి రాజిరెడ్డి, మెదక్​ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్,  తహసీల్దార్ శ్రీనివాస్, కాలేజీ ప్రిన్సిపాల్​గణపతి తదితరులు పాల్గొన్నారు. 

 చెరువులను పరిశీలించాలి

మెదక్​ జిల్లాలోని హెచ్​ఎండీఏ పరిధిలోని నర్సాపూర్​, శివ్వంపేట, తూప్రాన్​, మనోహరాబాద్​ మండలాల్లోని చెరువులు, శిఖం భూములను  క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్​ రాజర్షి షా అధికారులకు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్​ హాల్​లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు. నాలుగు మండలాల అధికారులు సర్వే  రికార్డు ప్రకారం పరిశీలన చేసి ఏ చెరువు.. ఎంత ఉందనే రికార్డులు నమోదు చేసుకోవాలని సూచించారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. మెదక్​ జిల్లా ఫొటో గ్రాఫర్స్ ​అండ్​ వీడియో గ్రాఫర్స్​ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 19న ఫొటోగ్రఫీ వేడుకలు, వృత్తినైపుణ్య కార్యక్రమాల వాల్ పోస్టర్​ను రిలీజ్​ చేశారు. కార్యక్రమంలో మెదక్​ జిల్లా ఫొటోగ్రాఫర్ల సంఘం ప్రెసిడెంట్​ బిట్ల నర్సింలు, ప్రధాన కార్యదర్శి గిర్ని ప్రభు గౌడ్,  జిల్లా కోశాధికారి పొట్లచెరువు నాగరాజు,  బస్వరాజు, విఘ్నేశ్, గిరి, శ్రీకాంత్, రంజిత్, కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.