సారూ.. వరి వద్దంటిరి.. ఇగ ఎట్ల బతకాలె

సారూ.. వరి వద్దంటిరి.. ఇగ ఎట్ల బతకాలె
  • కేసీఆర్​కు లెటర్​ రాసి మెదక్​ జిల్లా రైతు ఆత్మహత్య
  • సీఎం మాట విని వానాకాలం సన్నొడ్లేసిన రవికుమార్​
  • దిగుబడి రాలే, గిట్టుబాటు కాలే
  • వరి తప్ప వేరే పంట పండని పొలం ఆయనది
  • యాసంగిలో వరి వేయొద్దనడంతో మనస్తాపం
  • అనారోగ్యంతో బాధపడుతున్న కొడుక్కి ట్రీట్​మెంట్​ చేయించలేని దుస్థితి
  • వృద్ధుడైన తండ్రికి అందని పింఛన్​

కేసీఆర్​ గారికి..  
వర్షకాలం సన్నరకం వెయ్యమన్నరు..  నేను మొత్తం సన్నరకం వరి వేశాను.. దిగుబడి తక్కువ వచ్చింది.. మద్దతు ధర లేదు.. ఇప్పుడు ఫుల్లు నీళ్లున్నయ్​.. నా పొలంల మొత్తం వరి సాగైతది.. కానీ వరి వద్దంటే నేను ఏం చేయగలను..? కౌలు పైసలు ఎట్లా ఇవ్వగలను? నా కొడుక్కి నెల నెలా ఇంజక్షన్​ ఎట్లా వేయించాలి.. మా నాన్నకు 67 ఏండ్లున్నా పింఛన్​ కూడా వస్తలేదు.’’                                              - రైతు కరణం రవికుమార్ రాసిన​ సూసైడ్​ నోట్​ సారాంశం

మెదక్/ మెదక్​ టౌన్​, వెలుగు: సీఎం కేసీఆర్​ చెప్పిన మాట విని వానాకాలంలో సన్నవడ్లు పండిస్తే.. దిగుబడి రాలేదు. పండిన ఆ కొద్దిపంటకైనా గిట్టుబాటు ధర వస్తదనుకుంటే అదీ లేదు. ఆఖరికి లాగోడి పైసలు కూడా ఎల్లలేదు. యాసంగిలో వరి పండిస్తెనన్నా ఎంతో కొంత మిగులుతదనుకున్నడు ఆ రైతన్న. కానీ, ఈ సీజన్​లో వరి వేయొద్దని సర్కారు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పటికే అప్పుల బాధతో 30 గుంటల పొలం అమ్మేసిండు. ఒక దిక్కు అనారోగ్యంతో బాధపడుతున్న కొడుక్కు వైద్యం చేయించడానికి కూడా ఆ అన్నదాత దగ్గర చిల్లిగవ్వ లేదు. మరో దిక్కు వృద్ధుడైన తండ్రికి సర్కారు నుంచి పింఛన్​ కూడా వస్తలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరి వేయకపోతే కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలని కలత చెంది.. సీఎం కేసీఆర్​కు లెటర్​ రాసి పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచాడు మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్​ మండలం బోగడ భూపతిపూర్​ రైతన్న కరణం రవికుమార్​. 


బోగడ భూపతిపూర్​కు చెందిన కరణం రవికుమార్ (40)కు గ్రామంలో 3 ఎకరాల 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. దాంతోపాటు మరో ఎకరంన్నర కౌలుకు తీసుకుని సాగుచూస్తే కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య పెంటవ్వ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్దకూతురుకు పెండ్లయింది. చిన్న కూతురు ఉమాదేవి తొమ్మిదో క్లాస్​, కొడుకు సాయికిరణ్  ఎనిమిదో క్లాస్​ చదువుతున్నారు. వానాకాలంలో సర్కారు సూచన మేరకు 5.10 ఎకరాల్లో రవికుమార్​ సన్నరకం వరి సాగు చేశాడు. భారీ వర్షాలు, చీడపీడల కారణంగా ఆశించిన దిగుబడి రాలేదు. మార్కెట్​లో గిట్టుబాటు ధర దక్కలేదు. పెట్టుబడి పైసలు కూడా మీద పడ్డాయి. 

కొడుకు ట్రీట్​మెంట్​ కోసం రూ. 18 లక్షలు ఖర్చు
రవికుమార్​ కొడుకు సాయికిరణ్​ కొంత కాలంగా అరుదైన హిమోఫీలియా అనే జబ్బుతో బాధపడుతున్నాడు. ఆ బాబుకు చిన్న దెబ్బ తగిలినా రక్తం ఆగదు. పొలంలో పండిన పంట ద్వారా వచ్చిన మొత్తాన్ని కొంతకాలంగా కొడుకు ట్రీట్​మెంట్​ కోసమే రవికుమార్​ ఖర్చు చేస్తున్నాడు. సాయికిరణ్​ ట్రీట్​మెంట్​ కోసం ఇప్పటి వరకు రూ. 18 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఈ అప్పులు తీర్చేందుకు ఇటీవల 30 గుంటల భూమిని కూడా అమ్మేశాడు. అయినా అప్పులు తీరలేదు. రవికుమార్​ అటు వానాకాలం, ఇటు యాసంగిలోనూ వరి సాగుచేస్తున్నాడు. వానకాలం చీడపీడల కారణంగా దిగుబడి పెద్దగా రాకపోవడంతో యాసంగిపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గురువారం గ్రామానికి వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్లు యాసంగిలో వరి సాగు చేయొద్దని, వేరే పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. వరి సాగు చేస్తే ప్రభుత్వం వడ్లు కొనదని తేల్చిచెప్పారు. కానీ తన పొలం వరి సాగుకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని, వేరే పంటలు వేస్తే దిగుబడి రాదని, పెట్టుబడులు కూడా ఎక్కువ అవుతాయని రవి కుమార్​ తోటి రైతులతో వాపోయాడు. యాసంగిలో వరి పండకుంటే అప్పులు తీర్చలేనని, కొడుకు ట్రీట్​మెంట్​చేయించలేనని మనాది పెట్టుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున తన పొలం దగ్గర పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచాడు. ఆయన వద్ద పోలీసులకు సూసైడ్​ లెటర్​ దొరికింది. వానాకాలంలో సన్నవడ్లు పెడ్తే దిగుబడి రాలేదని, ఇప్పుడు వరి వేయొద్దంటే ఏం చేయాలో తెలియడం లేదని సీఎం కేసీఆర్​ను ఉద్దేశించి లెటర్​లో రవికుమార్​ రాశాడు. తన తండ్రికి  67 ఏండ్లు ఉన్నా పింఛన్​ కూడా రావట్లేదని అందులో పేర్కొన్నాడు. రవికుమార్​ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పోలీసులు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవికుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ కాంగ్రెస్​ పార్టీ నాయకులు బాలకృష్ణ, హఫీజొద్దీన్​, పద్మారావ్ ఆధ్వర్యంలో మెదక్​ ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని, అనారోగ్యంతో ఉన్న ఆయన కొడుక్కు ట్రీట్​మెంట్​ చేయించాలని డిమాండ్ చేశారు.  రవి కుమార్​ ​ కొడుకు సాయి కిరణ్​కు నెలకు రూ. 20 వేల ఇంజక్షన్​ ఇవ్వాల్సి ఉంటుందని స్థానికులు చెప్పారు. 

వరి తప్ప వేరే పంట పండది
అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఊరికి వచ్చి రైతులు యాసంగిలో వరి పెట్టొద్దని చెప్పిన్రు. రవికుమార్​ పొలంలో వరి పంట తప్ప వేరే పంటలు పండయ్​. దాంతోని వరి వేయకుంటే బతుకు దెరువు ఎట్ల.. కొడుక్కు దవాఖాన ఖర్చులకు పైసలెట్ల అని బెంగపెట్టుకొని పురుగు మందు తాగి సచ్చిపోయిండు.
- భాగయ్య, రైతు, బోగడ భూపతిపూర్​

రందితోని పానం తీసుకున్నడు
రవికుమార్ వానాకాలంలో సన్నరకం వరి వేసిండు. అయితే దిగుబడి చాలా తక్కువొచ్చింది. దాంతోటి పంట పెట్టుబడికి చేసిన అప్పు ఎట్ల తీర్చాలె.. వరి కోసిన మిషన్ల కిరాయి ఎట్ల కట్టాలె.. మళ్లా యాసంగికి పెట్టుబడికి ఎట్ల అని రందివడి పాణం తీసుకున్నడు.     - ఉప్పర్​పల్లి సంగ గౌడ్​, రైతు, బోగడ భూపతిపూర్​  

రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే
రవికుమార్​ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. రైతు సూసైడ్​ విషయం తెలియడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఆమె.. రవికుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి హరీశ్​  దృష్టికి తీసుకెళ్తానని,  మృతుడి కొడుకు సాయికిరణ్​ కు మెరుగైన ట్రీట్​మెంట్​ అందేలా చూస్తామన్నారు. 

రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి: అన్వేష్ ​రెడ్డి
రైతు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఒక ప్రకటనలో కాంగ్రెస్​ కిసాన్ ​సెల్​ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్​  రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం అమ్మి 15 రోజులైనా రవికి డబ్బులు అందలేదని తెలిపారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. పంటల మీద ఆంక్షలు విధించడానికి వచ్చిన అధికారులను నిలదీయాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు. 

సీఎం స్పందించరా?
కేసీఆర్ పాలనలో రైతు కుటుంబాల దీనస్థితికి ఈ ఆత్మహత్యే నిదర్శనం. పంటకు ధర లేదు..  చివరికి వృద్ధులకు పెన్షన్​ కూడా లేని దయనీయమైన స్థితి నెలకొంది. తెలంగాణ మొత్తం రైతుల బొందల గడ్డగా మారే దాకా కేసీఆర్​ స్పందించరా?                                                                     - రేవంత్​రెడ్డి, పీసీసీ చీఫ్

షరతుల సాగు వల్లే ఆత్మహత్యలు
రాష్ట్ర ప్రభుత్వం షరతుల సాగు  చేయించాలని చూడడం దారుణం. ప్రభుత్వం తీరు మార్చుకొని.. రైతుల ఇష్టం మేరకు నడుచుకోవాలి. రాష్ట్ర సర్కారు విధానాల మూలంగానే  రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి.  రైతులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. 
                                                                                                                                                                                                - ఎం.రఘునందన్ రావు, ఎమ్మెల్యే , దుబ్బాక