- సమ్మెలో రైస్ మిల్లర్లు
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మెదక్జిల్లా అధికారుల దృష్టి
మెదక్, వెలుగు: వానాకాలంలో సాగు చేసిన వరి పైర్లు ఈనుతున్నాయి. ముందుగా సాగు చేసిన ప్రాంతాల్లో వచ్చే నెల మొదటి వారం నుంచి వరి కోతలు షురూ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై కసరత్తు మొదలు పెట్టింది. కాగా విజిలెన్స్ దాడులు, కేసులను నిలిపివేయాలని, తమ డిమాండ్ లు పరిష్కరించాలంటూ రైస్ మిల్లర్లు సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ధాన్యం నిల్వకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు.
కొనుగోలు కేంద్రాలకు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం..
మెదక్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్ లో 2.93 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. తద్వారా 6.50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉంది. రైతుల అవసరాలకు, ప్రైవేట్ లో అమ్మకాలు పోను కొనుగోలు కేంద్రాలకు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. పీఏసీఎస్, ఐకేపీ, ఏఎంసీ, ఎఫ్పీవో ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం రైస్ మిల్లులకు తరలించాల్సి ఉంటుంది.
2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ కెపాసిటీ...
జిల్లా వ్యాప్తంగా 103 రైస్ మిల్లులు ఉండగా, ఇందులో 43 బాయిల్డ్ మిల్లులు, 60 రా రైస్ మిల్లులు ఉన్నాయి. ఆయా రైస్ మిల్లులకు 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ కెపాసిటీ ఉంది. అయితే విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు, కేసులు నిరసిస్తూ, తమ13 డిమాండ్ లు పరిష్కరించాలంటూ రైస్ మిల్లర్లు మిల్లులు బంద్ పెట్టి ఆందోళన బాట పట్టారు. మిల్లర్ల సమ్మె నేపథ్యంలో వానాకాలం సీజన్ లో కొనుగోలు చేసే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సివిల్ సప్లై అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో పలుకొన్ని చోట్ల గోదాములు ఉన్నప్పటికి వాటిల్లో గడచిన యాసంగి సీజన్ లో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేశారు.
ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అధికారులు
రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యామ్నాయంగా మార్కెట్ యార్డులు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ గోదాముల కోసం సివిల్ సప్లై అధికారులు అన్వేషణ చేస్తున్నారు. మండలాల వారీగా ఎక్కడ ధాన్యం నిల్వకు అవకాశం ఉందనేది పరిశీలన జరుపుతున్నారు. ధాన్యం నిల్వకోసం ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో షెడ్ల నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ఉందని ఓ అధికారి తెలిపారు. అయితే దీని సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యే లోగా రైస్ మిల్లర్లు సమ్మె విరమించకుంటే ధాన్యం నిల్వకు ఇబ్బందే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
