వెల్దుర్తి, కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ పరిధిలో ఇద్దరు శిశువుల విక్రయాలు జరిగినట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన ప్రకారం... ఉప్పు లింగాపూర్ గ్రామానికి చెందిన ఎరుకల సాయిలు కూతురు మమతను కౌడిపల్లికి చెందిన చిన్నాకు ఇచ్చి వివాహం జరిపించారు.
2024లో చిన్నా మృతిచెందడంతో అప్పటి నుంచి మమత తన అమ్మగారైన ఉప్పు లింగాపూర్ గ్రామంలో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చి ఏప్రిల్ 17న మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా బిడ్డ పోషణ భారం కావడంతో తనకు పుట్టిన మగ శిశువును వేరే దంపతులకు అమ్మేసినట్టు సమాచారం.
అలాగే ఉప్పు లింగాపూర్ తండాలో 25 రోజుల క్రితం మరో శిశువు విక్రయం జరిగినట్లు సమాచారం. శిశు విక్రయాలు జరిగిన విషయం వెలుగులోకి రావడంతో సోమవారం ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు ఉప్పు లింగాపూర్ చేరుకుని విచారణ చేపట్టారు.
