ఆసియాలోనే అతిపెద్ద పండుగ మేడారం జాతర. సమ్మక్క - సారలమ్మ జాతర అంటేనే భక్తి, విశ్వాసం, నమ్మకం. కోట్లాది మంది ప్రజలు ఆ వనదేవతలను దర్శించుకునేందుకు తరలివస్తారు. అయితే లేటెస్ట్ గా టాలీవుడ్ నటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కతో కలిసి చెల్లించిన మొక్కు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో టీనా వ్యవహారంపై చర్చనీయాంశమైంది.
వివాదానికి అసలు కారణం ఏమిటి?
'కమిటీ కుర్రోళ్లు', 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి చిత్రాలతో గుర్తింపును సొంతం చేసుకున్న తెలుగు ముద్దుగుమ్మ టీనా శ్రావ్య. ఈ బ్యూటీ ఇటీవల మేడారం జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకుంది. ఈ మేడారం జాతరలో భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని తూకం వేసి మొక్కు చెల్లించుకోవడం ఆచారం. అయితే ఇక్కడ టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను తక్కెడలో కూర్చోబెట్టి, దానికి సమానమైన బెల్లాన్ని ( బంగారం ) తూకం వేసి మొక్కు తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లలో కొందరు టీనాను సమర్థిస్తుండగా.. మరికొందరు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
విమర్శల వెల్లువ
ఈ వీడియోను చూసిన ఆదివాసీ సంఘాలు , కొంతమంది భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఎంతో పవిత్రంగా భావించే తక్కెడలో జంతువును ఉంచడం దేవతలను అవమానించడమేనని కొందరు మండిపడుతున్నారు. గిరిజన ఆచారాల ప్రకారం సమ్మక్క-సారలమ్మలను ప్రకృతి స్వరూపిణిలుగా కొలుస్తారు. ఇక్కడ ప్రతి మొక్కు వెనుక ఒక పవిత్రత ఉంటుంది, దానిని సెలబ్రిటీ హోదాలో ఉండి కించపరచడం సరికాదని విమర్శిస్తున్నారు.
అయితే మరికొందరు మాత్రం టీనా శ్రావ్య చర్యలను సమర్థిస్తున్నారు. పెంపుడు జంతువులను తమ బిడ్డల్లా భావించే వారు, వాటి క్షేమం కోరుతూ మొక్కులు చెల్లించడంలో తప్పులేదని వాదిస్తున్నారు. దేవుడి దృష్టిలో అన్ని జీవులు సమానమేనని, మూగజీవి పట్ల ఉన్న ప్రేమను భక్తితో ముడిపెట్టడం తప్పెలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీలు చేసే ప్రతి పని ప్రజల్లోకి త్వరగా వెళ్తుంది. భక్తి అనేది వ్యక్తిగతమైనప్పటికీ, ప్రజాక్షేత్రంలో సంప్రదాయాలను పాటించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
