మేడారంలో కీలక ఘట్టం​: గద్దెపైకి చేరుకున్న సమ్మక్క అమ్మవారు

మేడారంలో కీలక ఘట్టం​:  గద్దెపైకి చేరుకున్న సమ్మక్క అమ్మవారు

మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. అమ్మవారి నామస్మరణలో వనం మారుమ్రోగుతుంది.  సమ్మక్క అమ్మవారిని గద్దెపై ప్రతిష్ఠించారు. భక్తులు సమ్మక్క ప్రతిరూపాన్ని చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చారు. డప్పు వాయిద్యాల, శివసత్తుల పూనకాల నడుమ ఊరేగింపుగా సమ్మక్కను గిరిజన పూజారులు గద్దెలపైకి తోడుకొని వచ్చారు. భక్తులు జయజయధ్వానాలు, పొర్లుదండాలు పెడుతూ సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్కను  గద్దెలపై ప్రతిష్ఠించారు. కాగా, మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. జై సమ్మక్క అంటూ మేడారం పరిసరాలు మార్మోగిపోతున్నాయి.  పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకుని.. భక్త జనులకు దర్శనమిస్తున్నారు.పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిసిపోతున్నది. మేడారం గద్దెపై కొలువుదీరనున్న ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించడానికి గద్దెల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోతున్నది.

సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలయ్యాయి. పూజారులు అడవి నుంచి వెదురు వనం, అడెరాలు తెచ్చి గద్దెపై ఉంచారు. సాయంత్రం ప్రధాన పూజారి నేతృత్వంలో పూజాలరుల బృందం చిలుకలగుట్ట అడవికి వెళ్లింది. అక్కడి నుంచి గుట్టపైకి ప్రధాన పూజారి ఒక్కరే వెళ్లారు. అక్కడ పూజా తంతు అంతా ఆనవాయితీ ప్రకారం గోప్యంగా సాగింది. ఆ తర్వాత తల్లిని తీసుకొని కిందికి దిగారు.కుంకుమ భరణి రూపంలో చిలకలగుట్ట దిగిన సమ్మక్క గద్దెల వద్దకు బయలుదేరింది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ దారిపొడవునా అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. 

మేడారంలో వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్కకు మంత్రి సీతక్క ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ శబరీశ్ గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలికారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఆమె రాక కోసం తనువెల్లా కళ్లు చేసుకొని ఎదురు చూసిన యావత్ భక్తకోటి… ఆమె గుట్ట దిగగానే జేజేలు పలికారు. సమ్మక్కను చిలకల గుట్ట నుంచి దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా డోలు వాద్యాలు, గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. డప్పు చప్పుళ్లు, డోలు వాద్యాలు మారుమోగుతుంటే అడవిని వీడి సమ్మక్క జనం మధ్యకు వచ్చి గద్దెలపైకి చేరింది.

గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. జంపన్నవాగు జనసంద్రమైంది. కీకారణ్యం కోలాహలంగా మారింది. ఇది జనమా – వనమా అనట్లు మేడారం అభయారణ్యం మొత్తం జనారణ్యంగా మారిపోయింది. ఎడ్ల బండ్ల నుంచి మొదలుకొని హెలికాప్టర్ల వరకు మేడారానికి కదిలారు. అశేష జనవాహినితో కీకారణ్యం కొత్త శోభను సంతరించుకుంది. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలాచరిస్తూ ఎత్తుబంగారాలు, ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. సల్లంగా సూడు తల్లీ అంటూ శరణు ఘోషలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి.