మేడారంలో రోడ్లే.. బిగ్ సవాల్!.. ప్రధాన రహదారుల విస్తరణకు ఈనెల10 డెడ్ లైన్

మేడారంలో రోడ్లే.. బిగ్ సవాల్!..  ప్రధాన రహదారుల విస్తరణకు ఈనెల10 డెడ్ లైన్
  • ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి సీతక్క 
  • అధికారుల్లో సమన్వయ లోపంతో వర్క్స్ లేట్ 
  • నత్తనడకన కల్వర్టులు, జంపన్నవాగు, కొత్తూరు రోడ్డు పనులు 
  • అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇప్పటికే పెరిగిన భక్తుల రద్దీ 
  • పనుల్లో వేగం పెంచకుంటే.. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు

ములుగు/తాడ్వాయి, వెలుగు : ఆసియాలోనే అతిపెద్ద మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతర కోసం చేపట్టిన రోడ్ల విస్తరణ పెద్ద సవాల్​గా మారింది. పనుల పూర్తికి డెడ్ లైన్ 10 వ తేదీ దగ్గర పడుతున్నా అధికారుల్లో సమన్వయలోపం కనిపిస్తుంది.  ప్రధానంగా ఆలయ అభివృద్ధి పనుల్లో జిల్లా ఉన్నతాధికారులు అలసత్వం చూపుతున్నా రు. మహాజాతర ఈ నెల28 నుంచి 31వరకు జరగనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వందల ఏండ్లపాటు చరిత్ర నిలిచిపోయేలా రాతి శిలలపై అమ్మవార్ల చరిత్రను చెక్కించే పనులు చివరి దశకు చేరాయి.

అదేవిధంగా ఆలయం చుట్టూ క్యూలైన్ల పనులు నిర్వహిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పించేం దుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మంత్రి సీతక్క, జిల్లా ఆఫీసర్లు పర్యటిస్తూ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నా  జాతర నాటికి పనులు పూర్తికావనే ఆందోళన నెలకొంది.  

49  రోడ్లు, 3 కల్వర్టుల పనులు 

మహాజాతర సందర్భంగా  ఆర్అండ్ బీ పరిధిలోని బీటీ, సీసీ రోడ్లు, కల్వర్టులు, ఇతర అభివృద్ధి పనులు, కొత్త రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది.  మొత్తం 49 రోడ్లను గుర్తించగా.. ఇందులో పాతవి 39, కొత్తవి10 రోడ్లు, 3 కల్వర్టులు ఉన్నాయి. పాత రోడ్లలో జాతీయ రహదారులు10, ఆర్అండ్​బీ రోడ్లు19, పంచాయతీ రాజ్10 రోడ్లు ఉండగా.. వీటన్నింటిని కలిపేలా  కొత్తగా సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం చేయిస్తోంది.  24 ప్రాంతాల్లోని ఫారెస్ట్ ఏరియా, 22 లొకేషన్లలో పట్టా భూములు, మరో 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో మొత్తం1,511 ఎకరాల్లో పార్కింగ్​సదుపాయాల ను కల్పించనుంది.  జాతీయ రహదారుల శాఖ 8 చోట్ల రూ.3.60కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

ఎన్​హెచ్​పై హన్మకొండ జిల్లా కటాక్షపూర్​బ్రిడ్జి, ములుగు జిల్లా మల్లంపల్లి సమీపంలోని ఎస్ఆర్ ఎస్పీపై బ్రిడ్జి పనులు పెండింగ్​లో ఉన్నాయి. కటాక్షపూర్ బ్రిడ్జి ఈనెల 25 వరకు, మల్లంపల్లి బ్రిడ్జి గత నెల 31వరకు పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, సీతక్క మేడారంలో 10 రోజుల కింద నిర్వహించిన రివ్యూలో అధికారులను ఆదేశించారు. కానీ, మల్లంపల్లి, కటాక్షపూర్​బ్రిడ్జిల నిర్మాణ పనుల్లో వేగం పెంచలేదు.  

మంత్రులు, ఆఫీసర్ల తరచూ పర్యవేక్షణ 

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క మేడారం జాతర అభివృద్ధి పనులను  నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, గుత్తేదారులతో  రివ్యూ నిర్వహిస్తున్నారు. కలెక్టర్​దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్​రాంనాథ్​కేకన్​ కూడా పనుల ఫురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. మహాజాతరకు ఇంకా 21 రోజులు  సమయం ఉంది. పనులు స్పీడప్​ చేసేందుకు కాంట్రాక్టర్లకు అధికారులు సూచిస్తున్నారు.  ఆర్అండ్ బీ, పీఆర్​శాఖలు చేపట్టిన రోడ్ల పనుల్లో నిర్లక్ష్యంగా ఆయా శాఖల ఆఫీసర్లపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తితో ఉన్నారు. ఈనెల10లోపు పనులన్నీ పూర్తికావాలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే భక్తుల రద్దీ పెరిగినందున జాతర సమయం దగ్గరపడుతుంటే మరింత మంది మొక్కులు చెల్లించేందుకు తరలిరానున్నారు.

ఇటీవల వరుస సెలవుల్లో భక్తులు గంటకు సుమారు 300 వాహనాల్లో మేడారం తరలివచ్చినట్లు ఓ సర్వేలో తేలింది. కాగా, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు భారీగా తరలివస్తారనే అంచనా ఉంది.  పనుల్లో జాప్యం జరిగితే ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తే చాన్స్ ఉంది. ఈనెల 15 నుంచి మేడారానికి భక్తుల తాకిడి పెరగనుండగా మహాజాతర మొదలైనట్లు భావిస్తారు. ఆలోపే మొత్తం పనులు పూర్తిచేసి జాతరను అధికార లాంఛనాలతో వైభవంగా ప్రారంభించేందుకు పూజారులు, ప్రభుత్వాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. పనుల్లో వేగం పెంచి జాతర  సమయానికి పనులు పూర్తి చేయాలని ప్రజలు, భక్తులు కోరుతున్నారు.

రోడ్లపై కంకర కుప్పలు  

మేడారం - తాడ్వాయి మధ్యలో 3 చోట్ల కల్వర్టుల నిర్మాణాలను  ప్రభుత్వం రూ. కోటితో చేపట్టింది. రోడ్ల విస్తరణతో పాటు డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్​లైటింగ్​పనులకు కూడా నిధులు మంజూరు చేసింది. అయితే.. రోడ్డుపై కంకర కుప్పలు దర్శనమిస్తున్నాయి. మేడారం ఆర్టీసీ బస్టాండ్​నుంచి జంపన్నవాగు వరకు సీసీ, బీటీ రోడ్డు, జంక్షన్లలో బ్యూటిఫికేషన్ పనులు నడుస్తున్నాయి. జంపన్న వాగు నుంచి ఆర్టీసీ స్టాప్​వరకు రోడ్డు విస్తరణ పనులు, ఊరట్టం స్థూపం నుంచి కొత్తూరు మీదుగా కాల్వపల్లి క్రాస్​రోడ్డు వరకు సీసీ రోడ్డు పనుల్లో వేగం లేదు.  

అధికారులను మంత్రులు హెచ్చరించినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలో మొత్తం 26 పనులకు రూ.144.94కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్​శాఖ చేపట్టిన 85 పనులకు  రూ.48కోట్లు ఇచ్చింది. ఇందులో 12 పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.