మేడారం జాతర: కన్నేపల్లి సారాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

మేడారం జాతర: కన్నేపల్లి సారాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21న ప్రారంభమైన మహాజాతర వైభవంగా కొనసాగుతోంది.  ఫిబ్రవరి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరగనున్న ఈ జాతరకు తెలంగాణతోపాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రం ప్రభుత్వం.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించింది. 

ఈ జాతర సందర్భంగా బుధవారం కన్నేపల్లిలోని సారాలమ్మ ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలతో కన్నేపల్లి నుండిమేడారం గద్దెల పైకి కుంకుమ, బరిణితో పూజారులు బయల్దేరారు.అంతకుముందు ఈ రోజు ఉదయం ములుగు జిల్లా లక్మీపూరం మొద్దులగూడెం నుండి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారానికి బయలుదేరాడు. భారీ బందోబస్త్ మధ్య గిరిజన సంప్రదాయ పద్దతిలో పగిడిద్దరాజు శోభయాత్ర సాగుతుంది. 

బుధవారం సాయంత్రానికి సారలమ్మ, పగిడిద్దరాజుతోపాటు  కొండ్రాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకువస్తారు.రెండో రోజున మేడారం సమీపంలోని చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు. మూడో రోజు అమ్మవార్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.  తమ కోరికలు తీర్చమని భక్తులు బెల్లం (బంగారం)ను  నైవేద్యంగా సమర్పించుకుంటారు. నాలుగో రోజు పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది.