మేడారంలో ఒకే వరుసలో గద్దెలు.. సమ్మక్క- సారక్కల వరుసలోకి పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలు

మేడారంలో ఒకే వరుసలో గద్దెలు..  సమ్మక్క- సారక్కల వరుసలోకి పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలు
  • 3 వేల నుంచి 10 వేల మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాటు 
  • ప్రధాన ఆలయ విస్తరణ, అభివృద్ధికి సరికొత్త డిజైన్స్‌‌‌‌ విడుదల 
  • 180 ఫీట్ల పొడవు.. 80 ఫీట్ల వెడల్పుతో గద్దెల ప్రాంగణం విస్తరణ 
  • చిలుకలగుట్ట వైపు వెళ్లే మెయిన్‍ జంక్షన్‍ వద్ద ప్రధాన గేటు 
  • గద్దెల చుట్టూరా గతంలో  4 గేట్లు.. ఇప్పుడు మరో  నాలుగు పెంపు 

వరంగల్‍/ములుగు, వెలుగు:ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర జరిగే మేడారం సమ్మక్క–సారక్క తల్లుల ఆలయ విస్తరణకు రాష్ట్ర సర్కారు కొత్త మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌ను రూపొందించింది.  దీన్ని సీఎం రేవంత్‍రెడ్డి మంగళవారం మేడారంలో ఆవిష్కరించారు. 1986 తర్వాత మళ్లీ ఇప్పుడు అభివృద్ధి చేయబోయే మాస్టర్‍ ప్లాన్‍ డిజైన్లను పరిశీలిస్తే.. మేడారం జాతరలో ప్రధాన భాగమైన తల్లుల గద్దెల ఏరియా రూపురేఖలు మారనున్నాయి. 

ఏటేటా పెరుగుతున్న భక్తుల రద్దీతో ఇన్నాళ్లు చిన్నవిగా కనిపించే గద్దెల ఏరియా.. ఇప్పుడు విశాలంగా మారబోతున్నది.  గతంతో పోలిస్తే.. ఒకే సమయంలో మరో మూడొంతుల మంది భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా డిజైన్లు రూపొందించారు. సమ్మక్క–సారక్క గద్దెలు తప్పించి పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల స్థానాలను మార్చనున్నారు.  

చిలుకలగుట్ట వైపు కొత్త దర్వాజ

ఆలయ ప్రాంగణానికి తూర్పున చిలకలగుట్ట వైపు మెయిన్ జంక్షన్‌‌‌‌ వద్ద ఆదివాసీల సంస్కృతిని తెలిపేలా కొత్తగా  దర్వాజను నిర్మించనున్నారు. దీనిపై మేడారం జాతర చరిత్ర, ఆలయ పూజారుల వంశస్తుల సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొమ్ములు, గంటలు, వాయిద్యాలు, నాగుపాము, ఎద్దులు, ఎడ్ల బండ్లులాంటి చిత్రాల ప్రత్యేకతను చూపనున్నారు. ఇక్కడినుంచి దాదాపు 100 మీటర్ల దూరం వెళ్లాక గతంలోని గద్దెల ప్రాంతానికి వెళ్లే రెండో గేటు ఉండనున్నది. 

గద్దెల చుట్టూరా 8 గేట్లు., 4 మంచెలు 

సమ్మక్క–సారక్క తల్లుల గద్దెల చుట్టూరా ఇప్పటివరకు  4 గేట్లు ఉండగా.. వీటిని మరో 4 పెంచి 8 ద్వారాలు చేయబోతున్నారు. ప్రస్తుతం సమ్మక్క తల్లి గద్దె వద్దకు వచ్చే మెయిన్‍ గేటు, సారక్క గద్దె దాటాక బయటకు వెళ్లేచోట 2, వీఐపీ దర్శనాల కోసం మీడియా మంచె నుంచి ఒక గేటు మాత్రమే ఉండేవి. ప్రస్తుత డిజైన్‍ ప్రకారం..సమ్మక్క తల్లి వద్దకు వచ్చే ప్రధాన ద్వారం పక్కనే భక్తుల రద్దీని కంట్రోల్‍ చేసేలా మరో 2 గేట్లు ఉన్నాయి. చివర్లో బయటకు వెళ్లేచోట 3 ద్వారాలతోపాటు అడ్డంలో రెండు వైపులా 2 ద్వారాలు పెట్టబోతున్నారు. 

ఈ 8 గేట్లకు పూజారుల వంశాల చరిత్రను ప్రతిబింబించేలా ఆర్చ్​లు ఉంటాయి. ఇవేగాక ఇన్నాళ్లు ఆలయ ప్రాంగణం చుట్టూరా మీడియా కవరేజీ కోసం ఒక మంచె (వాచ్‌‌‌‌టవర్) ఉండగా..మాస్టర్‍ ప్లాన్‍ ప్రకారం 4 మంచెలు  నిర్మించనున్నారు.  మీడియా, సెక్యూరిటీ, ఎండోమెంట్‌‌‌‌తోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు,  ఇతర వీఐపీల పరిశీలన కోసం నాలుగు వైపులా 4 మంచెలు ఏర్పాటు చేయనున్నారు. 

పొడవు 180 ఫీట్లు.. అడ్డం 80 ఫీట్ల వెడల్పు

కోటిన్నర మంది భక్తులు దర్శించుకునే మేడారం జాతర సమ్మక్క–సారక్క తల్లుల గద్దెల ప్రాంతం లోపలి భాగంలో వెడల్పుతోపాటు చిన్నచిన్న మార్పులతో ఆలయాన్ని విస్తరించబోతున్నారు. సమ్మక్క తల్లి వైపు నుంచి చివరి వరకు ప్రస్తుతం 236 ఫీట్ల పొడవు ఉండగా.. దీనిని మరో 180 ఫీట్ల  వరకు విస్తరించనున్నారు. ఆలయ ప్రాంగణం 132 ఫీట్ల వెడల్పు ఉండగా.. రెండు వైపులా 20 ఫీట్ల చొప్పున మరో 40 ఫీట్లు విస్తరించబోతున్నారు. ఆ తర్వాతి భాగం సైతం రద్దీని కంట్రోల్‍ చేయడానికి బఫర్‍జోన్‍గా మార్చబోతున్నారు. 

ఒకే వరుసలో 4 గద్దెలు..10  వేలమంది దర్శనాలు 

మేడారం ప్రధాన ఆలయంగా భావించేచోట లోపలకు వెళ్లగానే సమ్మక్కతల్లి గద్దె.. అలానే ముందుకువెళ్తే బయటకు వెళ్లేచోట సారక్క తల్లి గద్దె ఉండేవి. మధ్యలో మీడియా పాయింట్‍ వైపు ఉండే గేటు వద్ద పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఉండేవి. ఈ క్రమంలో భక్తులు నలుగురి దర్శనాలు చేసుకునేందుకు అటుఇటు వెళ్లడంతో రద్దీ సమస్య ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేలా పూజారుల సూచన మేరకు పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను సైతం సమ్మక్క–సారక్క గద్దెల వరుసలోకి తీసుకురానున్నారు. 

దీనికోసం ప్రస్తుతం సారక్క తల్లి గద్దె తర్వాత విస్తరించబోయే స్థలంలో వరుసగా ఈ రెండు గద్దెలు రానున్నాయి. మొత్తంగా గద్దెలన్నీ ఒకే వరుస క్రమంలో ఉండబోతున్నాయి. ఇన్నాళ్లు గద్దెల ప్రాంతంలో దాదాపు 3వేల మంది భక్తులు దర్శనం కోసం ఒకేసారి నిల్చునే అవకాశం ఉండగా.. ఆలయ విస్తరణ పెంపుతో మూడింతలు పెరిగి ఒకేసారి 10,400 మంది భక్తులు వచ్చినా గద్దెల ప్రాంతంలో ఇబ్బందులు లేకుండా విస్తరిస్తున్నారు. పనులు చేపట్టే క్రమంలో మేడారం జాతర పూజారుల  సలహాలు, సూచనలు, అవసరాల మేరకు చిన్నపాటి మార్పులు చేసే అవకాశం ఉంది.