ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి

ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి

భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బీజేపీ పార్టీ తరపున కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రావుకి వినతిపత్రాన్ని అందజేశారు. సుభాష్ రెడ్డికి 90 ఎకరాల భూకబ్జాలో పాత్ర ఉందని ఆయన అన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించిందని ఆయన గుర్తుచేశారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి భూకబ్జాలకు పాల్పడి.. ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని.. అందుకే పోలీసులు వెంటనే ఆయనను అరెస్టు చేయాలని హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకి సహకరిస్తున్న రెవెన్యూశాఖ సిబ్బందిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువులు మొత్తం కబ్జాకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే.. ఇదే అదునుగా భావించి టీఆర్ఎస్ నాయకులు కబ్జాలకు తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు.