మంత్రి హత్యకు కుట్ర కేసు నిందితులకు బెయిల్

మంత్రి హత్యకు కుట్ర కేసు నిందితులకు బెయిల్

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితులకు మేడ్చల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులందరికీ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఏ 1 నుంచి ఏ 7 వరకు నిందితులు రూ.20వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మార్చి 28న బెయిల్ పిటీషన్పై వాదనలు పూర్తికాగా.. న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. పిటీషన్ పై విచారణ సందర్భంగా పోలీసులు.. నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని కౌంటర్ దాఖలు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వొద్దని, నిందితులు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తెచ్చారు. మరోవైపు నిందితుల పోలీస్ కస్టడీ ఇప్పటికే ముగిసినందున వారికి బెయిల్ మంజూరు చేయాలని డిఫెన్స్ లాయర్ న్యాయమూర్తిని అభ్యర్థించారు. వారంతా విచారణకు సహకరిస్తారని కోర్టుకు హామీ ఇచ్చారు, ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మంత్రి హత్యకు కుట్ర కేసులో విశ్వనాథ్కు బెయిల్ రావడంపై ఆయన భార్య పుష్పలత స్పందించారు. చేయని తప్పుకు తన భర్తను ఇన్నాళ్లు జైల్లో ఉంచారని ఆరోపించారు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ కేసులో విశ్వనాథ్ సాక్షిగా ఉన్నందునే ఆయనను ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. ఆర్థికంగా, మానసికంగా ఎంతగానో హింసించారన్న పుష్ప.. న్యాయం తమవైపున ఉన్నందునే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. మహబూబ్ నగర్ పోలీసులు తమకు సహకరించలేదని అన్నారు.

రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హత్య చేసేందుకు కుట్ర పన్నిన కేసులో నలుగురు నిందితులను గత నెల 26న, రెండు రోజుల తర్వాత మిగతా ముగ్గురిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మేడ్చల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. రాఘవేందర్ రాజు, నాగరాజు, విశ్వనాథరావు, యాదయ్య, రవి, మధుసూదన్ రాజు, అమరేందర్ రాజులను పోలీసుల కస్టడీకి అనుమతించింది. పోలీసులు 10 రోజుల కస్టడీ కోరగా.. కోర్టు కేవలం 4 రోజులకు మాత్రమే అనుమతించింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపాను సైతం పోలీసులు అరెస్ట్ చేయగా.. వ్యక్తిగత పూచీకత్తుపై అతన్ని విడుదల చేశారు. మిగతా నిందితుల పిటీషన్ పై విచారణ జరిపిన మేడ్చల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.