
ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఎన్ని రైడ్లు చేస్తున్నా.. ఎంత మందిని పట్టుకుంటున్నా లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. లేటెస్ట్ గా మేడ్చల్ జిల్లా ఎల్లంపేట్ మున్సిపాలిటీలో పురపాలకలో టౌన్ ప్లానింగ్ అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు.
హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లంపేట్ పురపాలక సంఘం పరిధిలోని హెచ్ఎండీఏ అనుమతి ఉన్న గంగస్థాన్ వెంచర్ నిర్వహకులు తమ పరిధి మేరకు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి గేట్లు ఏర్పాటు చేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన గేట్లను కూల్చివేస్తానని టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి బెదిరించారు. గోడ కూల్చకుండా ఉండడానికి బాధితుడిని రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు . దీంతో వెంచర్ నిర్వహకులు ఒప్పందం కుదుర్చుకుని వారం రోజుల క్రితం టీపీవోకి లక్ష రూపాయల లంచం ఇచ్చారు. మిగతా నాలుగు లక్షల డబ్బుల కోసం బాధితుడు ఏసీబీని సంప్రదించాడు.
ఇవాళ (సెప్టెంబర్ 27న) ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణ కోరడంతో కొంపల్లిలోని ఆయన ఇంటి దగ్గర బాధితుడి నుంచి రూ. 3 లక్షల 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎల్లంపేట్ పురపాలక సంఘం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాధాకృష్ణ రెడ్డి ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యాలయానికి రావాలని కోరినట్లు తెలిపారు. కమిషనర్ ప్రమేయం ఉందా లేదా అనేది పూర్తి విచారణ చేపట్టిన అనంతరం వెళ్లాడిస్తానని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తామని ఆయన తెలిపారు.