మేడ్చల్ లో లోటు వర్షపాతం.. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ లో అధికం

మేడ్చల్ లో లోటు వర్షపాతం..  హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ లో అధికం

హైదరాబాద్ సిటీ, వెలుగు: గత నెల అక్టోబర్ లో రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే అధిక  వర్షపాతం నమోదైంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మాత్రం 20 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

జిల్లాల్లో సగటున అక్టోబర్ నెలలో నమోదైన వర్షపాతానికి సంధించిన వివరాలను ఆ శాఖ శనివారం రిలీజ్ చేసింది. అక్టోబర్ లో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సగటున 148 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 107.7 మి.మీ కాగా, 37 శాతం ఎక్కువ పడింది. 

వికారాబాద్  జిల్లాలోనూ వర్షాలు సమృద్ధిగా కురిశాయి.  94.4 మిల్లిమీటర్ల సాధారణ  వర్షపాతం నమోదుకావల్సి ఉండగా, 115 మి.మీ రికార్డయ్యింది. ఇక్కడ సాధారణం కంటే 22 శాతం ఎక్కువగానే పడింది. హైదరాబాద్ జిల్లాలోనూ సగటున 130.8 మి.మీ వర్షపాతం నమోదైంది.  సాధారణ వర్షపాతం 113.9 మి.మీ కాగా, 15 శాతం అధికంగా నమోదైంది.  మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. ఇక్కడ కేవలం 84.2 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఇక్కడ సాధారణ వర్షపాతం 105.3 మి.మీ కాగా, 20 శాతం తక్కువగా కురిసింది.