కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలుస్తోంది : చామకూర మల్లారెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలుస్తోంది : చామకూర మల్లారెడ్డి

మేడిపల్లి, వెలుగు: ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెడితే.. పేదల ఇండ్లను కూలగొడుతోందని మాజీ మంత్రి, మేడ్చల్​ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం బోడుప్పల్, పీర్జాదిగూడలో మల్కాజిగిరి లోక్​సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ దేనన్నారు. 

మల్కాజిగిరి లోక్​సభ పరిధిలో బీఆర్ఎస్​బలంగా ఉందని చెప్పారు. ఇక్కడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మేయర్లే ఉన్నారని గుర్తుచేశారు. ప్రత్యర్థి పార్టీలకు సరైన క్యాడర్, నాయకులు, బూత్​ఏజెంట్లు లేరని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 100 రోజుల్లో చేసింది శూన్యమని,  పేదల ఇండ్లు కూల్చడంలో నంబర్​వన్​గా నిలిచిందని ఎద్దేవా చేశారు. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను ఎక్కుపెట్టిన ఘనత కాంగ్రెస్​నేతలకే దక్కుతుందన్నారు. 

రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలకు ఓట్లు వేయొద్దని పిలుపునిచ్చారు. ఢిల్లీ పార్టీలను వదిలి, తెలంగాణ పార్టీ అయిన బీఆర్ఎస్ కు అండగా నిలవాలని కోరారు. సమావేశాల్లో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, బోడుప్పల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు మద్ది యుగేందర్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, నాయకులు బైటింటి ఈశ్వర్ రెడ్డి, లేతాకుల రఘుపతి రెడ్డి పాల్గొన్నారు.