ప్రైవేట్ ఆస్పత్రుల్లో ముమ్మరంగా తనిఖీలు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ముమ్మరంగా తనిఖీలు
  • మెడికల్ ఆఫీసర్ డా.విజయ్ని ప్రైవేట్ ఆస్పత్రిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు

సూర్యాపేట: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. లేని సదుపాయాలు ఉన్నట్లు.. పెద్ద డాక్టర్ పేరు చెప్పుకుని కంపౌండర్లు, నర్సులే వైద్యం చేస్తున్న ఉదంతాలు గుర్తించి చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ మూడో రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేయగా.. ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు.

నల్లగొండ జిల్లా కేతేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పేద ప్రజలకు వైద్యం అందించే డ్యూటీలో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ గణపతి హాస్పిటల్ లో పేషెంట్లకు వైద్యం చేస్తూ తనిఖీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి గణేష్ ఆసుపత్రిని సీజ్ చేశారు. నిబంధనలు పాటించని.. రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న మరికొన్ని ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో మోసాలు, నిబంధనలను అతిక్రమించడం వంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.