తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో సోదాలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో సోదాలు..
  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో సోదాలు.. 
  • ప్రమాణాలు లేవన్న ఆరోపణలతో తనిఖీలు
  • త్వరలో ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వనున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్  నర్సింగ్, స్కూళ్లు, కాలేజీలలో వైద్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నర్సింగ్, స్కూళ్లు కాలేజీల్లో సరైన వసతులు లేవని, సరైన ప్రమాణాలు పాటించకుండానే నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రావడంతో... వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తనిఖీలకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సింగ్  స్కూళ్లు, కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి రిపోర్టు అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

దీంతో మంగళవారం అధికారులు సోదాలు చేశారు. తొలుత గ్రేటర్ లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్  రంగారెడ్డి జిల్లాలతో పాటు నల్గొండలోని నర్సింగ్  స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చాలా కాలేజీలు నిబంధలనకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా.. నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో అక్రమాలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా అనేక కంప్లైంట్స్  వస్తున్నాయి. క్రైస్తవ జన సమితి అనే సంస్థ నర్సింగ్, స్కూళ్లు కాలేజీల అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలోనే మంత్రి దామోదర తనిఖీలకు ఆదేశించారు.  

క్లినికల్  ప్రాక్టీస్  లేకుండానే పట్టాలు?

నర్సింగ్  ప్రైవేట్ స్కూళ్లు అడ్డగోలుగా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.  నల్లగొండలో ఒకే భవనంలో నాలుగు నర్సింగ్  స్కూల్స్, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌‌‌‌ లో ఒకే భవనంలో ఏకంగా ఎనిమిది నర్సింగ్  స్కూల్స్ నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమతులు తీసుకున్న ప్రాంతాల్లో కాలేజీలు లేకపోవడం, విద్యార్థులకు క్లినికల్  ప్రాక్టీస్  లేకుండానే పట్టాలు ఇస్తున్నట్లు సోదాల్లో తేలింది. కొద్ది రోజుల్లో నర్సింగ్  విద్యా సంస్థల్లో అక్రమాలపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించనున్నారు.