- ఆన్ లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా ఏఐఓసీడీ దేశవ్యాప్త నిరసన
- బంద్కు మద్దతు తెలిపిన తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్
- ఈ-ఫార్మసీలతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఆన్ లైన్ వర్సెస్ ఆఫ్లైన్ ఫార్మసీల వివాదం మరోసారి ముదిరింది. ఈ-ఫార్మసీలు, ఆన్ లైన్ మందుల విక్రయాలకు నిరసనగా ఈనెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ కు ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) పిలుపునిచ్చింది. ఈ బంద్ కు తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ (టీటీసీడీఏ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఎలాంటి భౌతిక తనిఖీలు లేకుండా మందులు విక్రయించడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే ప్రిస్క్రిప్షన్ ను పలుమార్లు ఉపయోగించి మందులు పొందే అవకాశం ఉండటంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది.
ఆ జీవోలను రద్దు చేయాలి..
కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో మందులను విక్రయిస్తూ మార్కెట్ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని టీటీసీడీఏ నేతలు మండిపడ్డారు. దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న చిన్న మెడికల్ షాపుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోవిడ్ సమయంలో అత్యవసర పరిస్థితుల కోసం జారీ చేసిన జీవో 220(ఈ)ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ-ఫార్మసీలకు సంబంధించిన జీవో 817(ఈ)ని కూడా ఉపసంహరించుకోవాలని కోరారు. ఆన్ లైన్ విక్రయాలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురాకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని అసోసియేషన్ హెచ్చరించింది.
