ఇండ్ల మధ్య కరోనా ట్రీట్ మెంట్ లో వాడిన పీపీఈ కిట్లు, మాస్కులు

ఇండ్ల మధ్య కరోనా ట్రీట్ మెంట్ లో వాడిన పీపీఈ కిట్లు, మాస్కులు

ఇండ్ల మధ్య మెడికల్ వేస్టేజీ
కరోనా ట్రీట్మెంట్ లో వాడిన పీపీఈ కిట్లు ,
మాస్కులను ఇష్టా రీతిన పడేస్తున్నరు
ఎస్సారెస్పీ కెనాల్ కు ప్రైవేట్ హాస్పిటల్ వేస్టేజీ
కాల్వ పరిసరాల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు
ఫైన్లు తప్పయాక్షన్ తీసుకోని ఆఫీసర్లు
స్థానికుల భయం భయం


వరంగల్, వెలుగు: బయో మెడికల్ వేస్టేజీ సిటీ జనాలను బెంబేలెత్తిస్తోంది. కరోనా పేషెంట్లకు సంబంధించిన మాస్కులు గ్లౌజ్లు, పీపీఈ కిట్లు ఇండ్ల మధ్యనే వేస్తుండడంతో స్థానికులు ఆందోళన పడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి మెడికల్ వేస్టేజీని ట్రీట్మెంట్ ప్లాంటుకు తరలించి కాల్చేయడం లేదా రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యర్థాల విషయంలో సంబంధిత ఆఫీసర్లు, సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ల నుంచి వస్తున్న వేస్టేజీతో ఓపెన్ ప్లేస్లు, ఎస్సారెస్పీ కెనాల్ ప‌రిసరాలు నిండిపోతున్నాయి. ఇక కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పీసీబీ రూల్స్ ను తుంగలో తొక్కి బయో మెడికల్ వేస్టేజీని కాల్వల్లో పడేస్తున్నాయి. ఈ జీవ వ్యర్థాలతో ఎన్విరాన్ మెంట్ క‌లుషితమవ్వడమే కాకుండా వాటి నుంచి వెలువడే వైరస్, బ్యాక్టీరియాతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉంది. అయితే ఎస్సారెస్పీ కాల్వ పక్కన చెత్తా చెదారం, ఇతర వ్యర్థాలు డంప్ చేస్తున్నవారికి మున్సిపల్ ఆఫీసర్లు ఫైన్లు వేసి విడిచిపెడుతున్నారు. కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే వర్షాలతో ఇండ్ల సమీపంలో నీళ్లు నిలిచి దోమలతో ఇబ్బందులు పడుతుంటే.. సమీపంలో వేస్తున్న బయో మెడికల్ వేస్టేజీతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తోందని ఎస్సారెస్పీ సమీప ప్రజలు వాపోతున్నారు.

రోజుకు టన్ను
కరోనా నేపథ్యంలో గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో బయో వేస్టేజీ పోగవుతోంది. ఎంజీఎంతో పాటు కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్,
పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్ , మామునూర్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన టెస్టింగ్ సెంటర్లు, ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి రోజుకు ఐదారు వందల కిలోల వేస్టేజీ వెలువడగా.. ఇప్పుడు రోజువారీగా 800 కిలోల నుంచి ఒక టన్ను వరకు బయో మెడికల్ వేస్టేజీ జమవుతోంది. దీన్ని కాకతీయ బయో మెడికల్ వేస్ట్ మేనేజ్ మెంట్ సంస్థ అమ్మవారిపేటలోని ట్రీట్ మెంట్ ప్లాంట్ కు తరలిస్తోంది. కానీ కొంత మంది సిబ్బంది నిర్ల‌క్ష్యం , ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాకం వల్ల మెడికల్ వేస్టేజీ ఎస్సారెస్పీ కాల్వ పరిసరాల్లో దర్శనమిస్తోంది.

భయాందోళనలో ప్రజలు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోం ఐసోలేషన్ సెంటర్ల నుంచి వచ్చే మిగిలిన ఆహారం, వాటర్ బాటిల్స్ , అక్కడి సిబ్బంది వాడే పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులను వేరుగా సేకరించి నాశనం చేయాల్సి ఉంది. కానీ పదిహేను రోజుల కిందట కేయూ నుంచి తీసుకొచ్చిన వేస్టేజీని దేవన్నపేట మార్గంలోని గోపాలపూర్ -కోమటిపల్లి మధ్య పడేసి వెళడ్లంతో స్థానికులు భయాందోళన చెంది సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో మున్సిపల్ సిబ్బంది వచ్చి వాటిని తొలగించారు. అలాగే గ్రేటర్ వ‌రంగ‌ల్ ప‌రిధి రామన్నపేట లోని జగ్జీవ‌న్ రామ్ క‌మ్యూనిటీ హాల్లో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తుండగా.. నిత్యం పదుల సంఖ్యలో జనం వస్తున్నారు. అయితే వారు వినియోగించిన మాస్కులు, గ్లౌజులు, ఇతర ‘కరోనా’ వేస్టేజీని అక్కడి బోరింగ్ పక్కనే పడేస్తుండడంతో తమకూ వైరస్ సోకే ప్రమాదం ఉందని స్థానికు లు భయాందోళన చెందారు. మంగళవారం ఆందోళనకు దిగి అక్కడి నుంచి కరోనా టెస్టింగ్ సెంటర్ ను తొలగించాలని ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు.