చెట్టును ఢీకొట్టిన కారు, మెడికో మృతి...మరో నలుగురికి గాయాలు

చెట్టును ఢీకొట్టిన కారు, మెడికో మృతి...మరో నలుగురికి గాయాలు
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మండలం జూబ్లీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఘటన

కరీంనగర్  క్రైం, వెలుగు: స్నేహితులను కలిసి తిరిగి వస్తుండగా, కారు ఆదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో మెడికో చనిపోగా, నలుగురికి  గాయాలయ్యాయి. కరీంనగర్  రూరల్  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడపకు చెందిన రాహుల్  రామిరెడ్డి(24), గుంటూర్ కు చెందిన మోపిదేవి జయంత్, రాయచూర్ కు చెందిన వినయ్, హైదరాబాద్  ఎల్బీనగర్ కు చెందిన మెండె పృథ్విరాజ్, సిద్దిపేటకు చెందిన పి.పృథ్విరాజ్  కరీంనగర్  ప్రతిమ మెడికల్  కాలేజీలో చదువుతున్నారు. వీరంతా కలిసి కారులో బొమ్మకల్  గ్రామం వద్ద ఉన్న చల్మెడ మెడికల్  కాలేజీలో చదువుతున్న  స్నేహితులను కలిసేందుకు సోమవారం రాత్రి వెళ్లారు.

 తిరిగి వస్తుండగా కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రూరల్​ మండలం జూబ్లీనగర్  గ్రామ శివారులోని ఎల్లమ్మ టెంపుల్  వద్ద  కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాహుల్  రామిరెడ్డి తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే చనిపోయాడు. మోపిదేవి జయంత్, వినయ్, పృథ్విరాజ్, పి.పృథ్విరాజ్ కు  గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడి అక్క సుష్మిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్  ఇన్స్​పెక్టర్  నిరంజన్ రెడ్డి తెలిపారు.

 ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఇరుక్కుపోయి రైతు..

జగిత్యాల రూరల్(బీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్): జగిత్యాల జిల్లా బీర్ పూర్  మండలం కొల్వాయి గ్రామానికి చెందిన చెట్ల గంగాధర్ గౌడ్(38) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ లో ఇరుక్కొని చనిపోయాడు. గ్రామంలోని తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ కు కేజీవీల్స్  బిగించి చదును చేస్తుండగా, సడెన్​గా ఆగిపోవడంతో రిపేర్లు చేస్తున్నాడు. ఆ సమయంలో కేజీ వీల్స్ కు ఉన్న ఇనుప నాగలి పైకి లేవడంతో గంగాధర్  అందులో ఇరుక్కుని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య చెట్ల రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్  తెలిపారు. 

కొండపోచమ్మ సాగర్ లో మునిగి యువకుడు..

ములుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొండపోచమ్మ సాగర్  రిజర్వాయర్ లో మునిగి ఒక యువకుడు చనిపోయాడు. మంగళవారం హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి, చందానగర్  రాజీవ్​ గృహకల్ప కాలనీకి చెందిన పట్నపోల్ల సాయికృష్ణ(24)  ఐదుగురు స్నేహితులతో కలసి కొండపోచమ్మ రిజర్వాయర్ కు వచ్చాడు.

 స్నేహితుల్లో ఒకరి బర్త్​డే కావడంతో సరదాగా గడిపేందుకు వచ్చారు. రిజర్వాయర్ లో ఈత కొట్టడానికి దిగగా సాయికృష్ణ నీళ్లలో మునిగిపోయాడు. స్నేహితులు అతడిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సైలు విజయ్ కుమార్, దామోదర్  స్పాట్ కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రి 8 గంటల ప్రాంతంలో డెడ్​బాడీ బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గల్ఫ్ లో వలస కార్మికుడు..

కోహెడ: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామానికి చెందిన మామిడి తిరుపతి(50) గుండెపోటుతో చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం 15 ఏండ్లుగా దుబాయ్  వెళ్లి వస్తున్నాడు. 

ఏడాది కింద దుబాయ్  వెళ్లి ఓ కంపెనీలో ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. మంగళవారం గుండెపోటుతో చనిపోయాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. డెడ్ బాడీని తెప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని  కోరుతున్నారు.