హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: గత ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ అత్యంత డేంజర్ జోన్‌లో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బ్యారేజీ పటిష్టత డొల్ల అని తేల్చి చెప్పింది. దేశంలోనే అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్న డ్యామ్స్ లిస్టులో మేడిగడ్డే మొదటి స్థానంలో ఉందని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని స్పెసిఫైడ్ డ్యామ్స్ జాబితాలోని ప్రాజెక్టుల పటిష్టత, డ్రిప్ నిధులపై ఏపీ ఎంపీలు బైరెడ్డి శబరి, జి.లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు.. గురువారం కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి ఈ మేరకు సమాధానమిచ్చారు. పోస్ట్ మాన్సూన్ స్టడీల్లో ఈ విషయం వెల్లడైందని చెప్పారు.
నిరుడు వానాకాలానికి ముందు రాష్ట్రంలోని మేడిగడ్డ సహా స్పెసిఫైడ్ డ్యామ్స్‌కు టెస్టులు నిర్వహించారు. అందులో మేడిగడ్డ బ్యారేజీకి డ్యామేజ్ చాలా తీవ్రంగా ఉందని, రిపేర్లు చేయాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు. నీళ్లు నింపే పరిస్థితి లేదని, నింపితే కూలిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. బ్యారేజీ ప్రస్తుతం ‘కేటగిరీ 1’జోన్‌లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని ఆ రిపోర్టులో స్పష్టం చేశారు.
ఆ రిపోర్టులను ఎప్పటికప్పుడు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ)కి అందించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే అధికారుల ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడైన విషయాలను ఎన్‌డీఎస్‌ఏకి ఇచ్చారు. ఆ వివరాలను కేంద్రం పార్లమెంట్‌లో వెల్లడించింది. రిపేర్లు చేయకుంటే బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, వెంటనే రిపేర్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరామని కేంద్రం తెలిపింది.
మరో రెండు ప్రాజెక్టులూ డేంజర్..
దేశంలో మేడిగడ్డతో పాటు మరో రెండు బ్యారేజీలు కూడా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని లోయర్ ఖజూరీ, జార్ఖండ్‌లోని బొకారో బ్యారేజీలూ ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు తెలిపింది. కేటగిరీ 2లో ఉన్న డ్యామ్‌లు 216 ఉండగా.. అందులో సగం డ్యామ్‌లు 50 ఏండ్లకు పైబడినవేనని పేర్కొంది. మరోవైపు, డ్యామ్ రిహబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ (డీఆర్ఐపీ) ఫేజ్– 2 కింద తెలంగాణకు రూ.100 కోట్లు కేటాయించగా, నిరుడు డిసెంబర్ 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వినియోగించుకోలేదని వెల్లడించింది.
