మేడిగడ్డ.. ఓ మేడిపండు! : మన్నారం నాగరాజు

మేడిగడ్డ.. ఓ మేడిపండు! : మన్నారం నాగరాజు

మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్​గా మారింది. బీఆర్​ఎస్​ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టామని చెబుతున్న  కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఆ బ్యారెజీ ఎన్నికల టైంలో కుంగటం బీఆర్​ఎస్​ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బకొట్టింది.  ప్రజానీకానికి కాళేశ్వరం లోపాలను మరింత చూపించాలని  కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 

మరోవైపు కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే అరోపణలపై హైకోర్టు మాజీ జడ్జి చేత విచారణ జరిపించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.  సిట్టింగ్​ జడ్జితో జ్యుడీషియల్‌‌ కమిషన్‌‌ వేసి, విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని సీఎం రేవంత్‌‌ ప్రకటించిన సంగతి విదితమే. ఇటీవల ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా కూడా.. నిర్మాణ లోపాలపై ఏం చెప్పాలన్నా జ్యుడీషియల్‌‌ కమిషన్‌‌కే చెప్పుకోవాలని ఆయన అధికారులను హెచ్చరించారు. 

కానీ..దేశవ్యాప్తంగా ప్రభావితం చూపే అంశాలు, దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశాలు, వివాదాలు తలెత్తితేనే హైకోర్టు సిటింగ్‌‌ జడ్జిలను కదపాలని, లేనిపక్షంలో వారి జోలికి వెళ్లరాదని సుప్రీంకోర్టు 2002లో తీర్పు ఇచ్చింది. ఇదే కారణంతో తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు ఎంతవరకు పరిశీలిస్తుందో చూడాలి.  కోర్టు అంగీకరించకుంటే మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ కమిషన్‌‌ ఏర్పాటయ్యే చాన్స్‌‌ ఉందని చెబుతున్నారు. దీనిపై న్యాయస్థానం చెప్పేదాకా వేచి చూడాలె.

మేడిగడ్డ బ్యారేజీకి  రూ.1,850 కోట్లు ఖర్చు 

మేడిగడ్డ బ్యారేజీకి లక్ష్మీ బ్యారేజీ అని పేరు పెట్టారు కేసీఆర్. మే 2016లో శంకుస్థాపన, 2019 జూన్‌‌లో నిర్మాణం పూర్తయింది. ఈ ఒక్క బ్యారేజీకే సుమారు రూ.1,850 కోట్లు ఖర్చు అయింది. 16 టీఎంసీల నీరు ఇందులో నిల్వ ఉండే ఏర్పాటు ఉంది. 85 గేట్లు ఉంటాయి. రెండేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసినట్టు నిర్మాణ సంస్థ ప్రకటించుకుంది. అదొక గొప్ప విషయంగా కూడా ప్రచారం చేశారు. ఇది బ్యారేజీ మాత్రమే కాకుండా వంతెన కూడా. 

ఆ రోడ్డు తెలంగాణ, మహారాష్ట్రలను కలుపుతుంది. పొడవు దాదాపు 1.6 కిలోమీటర్లు.  25 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పోసి నిర్మించిన మేడిగడ్డ  బ్యారేజీ ఎందుకు కుంగింది?  ఈ ఒక్క బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని చెప్పవచ్చు. ఇప్పుడు జరిగిన ఘటనతో అసలు మేడిగడ్డలో నీళ్లు ఆపే పరిస్థితి లేదంటున్నారు సాగునీటి నిపుణులు. ప్రస్తుతానికి ఉన్న నీరంతా ఖాళీ చేసేశారు. దీంతో ఇప్పుడు ప్రాణహిత నుంచి వచ్చే నీటిని నిల్వ చేయడానికి, ఆ నీటిని వెనక్కు తోడి సుందిళ్ల, అన్నారం దగ్గరకు మళ్లించి అక్కడ నుంచి తోడి నీరు ఇవ్వడానికి సాధ్యం కాదు. అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని నీటిని కూడా కిందికి వదిలేశారు. మూడు బ్యారేజీల్లోనూ ప్రస్తుతం నీళ్లు లేవు. 

పునాదుల నిర్మాణంలో లోపం

పిల్లర్లు కుంగడంతో మొత్తం ప్రాజెక్టు ప్రయోజనానికే గండి పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో కేంద్ర ఇంజినీర్లు ఉన్నారు.  స్పష్టంగా నిర్మాణంలో నాణ్యతా లోపమే అంటున్నది తెలంగాణ ఇంజినీర్ల ఫోరం. కచ్చితంగా పునాదుల నిర్మాణంలో లోపం వల్లే ఇలా జరిగిందన్నది సుస్పష్టం.  అసలు ఈ బ్యారేజీ ప్రారంభమై నాలుగేళ్లే అయింది. అప్పుడే ఎందుకు దెబ్బతింది? నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయా? మరమ్మతులు చేయగలరా? చేయడానికి ఎంత అవుతుంది, ఎంత కాలం పడుతుంది? అన్న​ అంశాలపై అనుమానం నెలకొన్నది. 

అందుకే ఈ మేడిగడ్డ బ్యారేజీని ఒక అందమైన మేడిపండు అంటూ అభివర్ణించవచ్చు. ఆ మేడిపండు తొలచాల్సిన బాధ్యత  ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఉన్నది. సీఎం రేవంత్​ రెడ్డి డైనమిజం నిశితంగా పరిశీలిస్తుంటే..  ఆయన దీనిపై విచారణ కమిటీ వేసి నిజాలను నిగ్గు తేల్చుతారని అనిపిస్తుంది. అయితే, నిందితులను తప్పక శిక్షించాలి. ఎందుకంటే, మన దేశ తొలి ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూ ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలతో పోల్చారు. దేవాలయాలపై నిత్యం రాజకీయం చేసే బీజేపీ ఈ అంశంలో కనీసం ఎటువంటి విచారణ కోరకపోవడం శోచనీయం.

కాళేశ్వరం అంతా రహస్యం

గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన పనుల గురించి చర్చిద్దాం. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులో 7 బుర్జ్ ఖలీఫాలకు సరిపడా కాంక్రీటు, 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడా ఉక్కు,  ప్రపంచంలో అతి పెద్దదైన గీజా పిరమిడ్ వంటి 6 పిరమిడ్ల పరిమాణంలో తవ్విన మట్టి, 72 గంటల్లో 25,584 ఘనపు మీటర్ల కాంక్రీటును పోయడం గిన్నిస్ రికార్డ్..  మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ఘనత గురించి దాని కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీ చెప్పిన మాటలివి. 

ఈ ప్రాజెక్టులో గేట్ల బరువును ఆపే స్తంభాల వంటి నిర్మాణాలు (పీర్) ఒక్కొక్కటీ 110 మీటర్ల పొడవు, 4-6 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తున కాంక్రీటుతో నిర్మించారు. ఇంత భారీగా కట్టిన పీర్‌‌లలో ఒకటి కుంగింది.  పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాలి. గతంలో కాళేశ్వరం పంప్ హౌసులు మునిగినప్పుడు, ప్రస్తుతం మేడిగడ్డ ప్రాజెక్టు మునిగినప్పుడూ కూడా మీడియాను అనుమతించలేదు బీఆర్​ఎస్​ ప్రభుత్వం. విషయం ఏంటో అన్నది తెలియకుండా అప్పటి సీఎం కేసీఆర్​ అంతా కాళేశ్వరాన్ని రహస్యంగానే ఉంచారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఘన విజయాల్లో కాళేశ్వరం ఒకటిగా చెప్పుకుంటూ వచ్చింది.  

కాళేశ్వరం ఒక అద్భుతమని, ప్రపంచంలోనే  పెద్దదని బీఆర్ఎస్ చెప్పుకుంటుండగా, ఇది అవినీతిమయమని, ఉపయోగంలేని ప్రాజెక్టనీ ప్రతిపక్షాలు విమర్శించినవేళ, సరిగ్గా ఎన్నికల ముందు ఈ ఘటన జరగడంతో మేడిగడ్డపై చర్చ మరింత వేడెక్కింది.

- మన్నారం నాగరాజు,సోషల్ ​ఎనలిస్ట్​