- బోర్‌హోల్స్ తవ్వడంలో ఇబ్బందులు
- మూడు బ్యారేజీలు కలిపి 500 బోర్హోల్స్అవసరం
- ఒక్కో బోర్‌హోల్ తవ్వేందుకు కనీసం ఐదు రోజులు
- జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్కే ఏడాదిన్నర పట్టే అవకాశం
- బ్యారేజీల్లో రాఫ్ట్‌లు దెబ్బతినకుండా పనులు
- ఖర్చులను భరించలేం: ఏజెన్సీలు
- క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినా బేఖాతర్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ బ్యారేజీ రిపేర్లకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినా.. ఆ రిపేర్లు ఇప్పట్లో అయ్యేలా కనిపించట్లేదు. అడుగడుగునా టెక్నికల్సమస్యలు వెంటాడుతున్నాయి. 2023 అక్టోబర్‌లో బ్యారేజీ కుంగిపోగా.. జియోటెక్నికల్ టెస్టులు చేసి పునరుద్ధరణ డిజైన్లు తయారు చేయాలని, ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించాలని నేషనల్డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రిపోర్టు ఇచ్చింది.
ఈ క్రమంలోనే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద జియోటెక్నికల్టెస్టులు చేసేందుకు పుణెకి చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్)కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. బ్యారేజీల వద్ద జియోటెక్నికల్ టెస్టులకు బోర్‌హోల్స్ తవ్వాల్సి ఉంది. మూడు బ్యారేజీలు కలిపి 500 దాకా బోర్‌హోల్స్ వెయ్యాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇప్పుడు ఆ బోర్‌హోల్స్ తవ్వడమే కష్టతరమవుతున్నదని అంటున్నారు. ఒక్క బోర్‌హోల్ తవ్వడానికి కనీసం 5 రోజుల సమయం పడుతున్నదని చెబుతున్నారు.
అత్యంత జాగ్రత్తగా..
మేడిగడ్డ బ్యారేజీలోని 85 గేట్ల వద్ద ఎగువన, దిగువన రెండు బోర్‌హోల్స్‌ను తవ్వాల్సి ఉంది. దీంతో పాటు ఎగువన స్ట్రీమ్‌లోనూ ర్యాండమ్‌గా బోర్‌హోల్స్ తవ్వాలని చెబుతున్నారు. ఈ క్రమంలోనే బ్యారేజీలో డౌన్‌స్ట్రీమ్, అప్స్ట్రీమ్లలో బోర్‌హోల్స్‌ను అత్యంత జాగ్రత్తగా తవ్వుతున్నారు. రీయిన్ఫోర్స్డ్రాఫ్ట్లపై నుంచి 25 మీటర్ల లోతు వరకు బోర్‌హోల్స్‌ను తవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. మరోవైపు బోర్హోల్స్వేసే క్రమంలో రాఫ్ట్‌లు దెబ్బతినకుండా నిదానంగా పనులు చేయాల్సి వస్తున్నది.
ఆదరాబాదరాగా చేస్తే రాఫ్ట్‌లు దెబ్బతిని మొదటికే మోసం వచ్చే ఆస్కారం ఉంటుందని అధికారవర్గాలు అంటున్నాయి. కాబట్టి, బోర్‌హోల్స్ తవ్వి.. జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసేందుకే కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర సమయమైనా పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జలసౌధలో రివ్యూ నిర్వహించిన ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్.. అన్ని బోర్‌హోల్స్ తవ్వే బదులు మేడిగడ్డలో కుంగిన ఏడో బ్లాక్ వద్ద మాత్రమే తవ్వి ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు కదా అని సూచించారు.
వాస్తవానికి ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టులో మాత్రం.. మూడు బ్యారేజీల్లోనూ అన్ని గేట్ల వద్ద జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. కానీ, ఆ రిపోర్టులోని అంశాలకు విరుద్ధంగా ఎన్డీఎస్ఏ చైర్మన్ చెప్పడంతో అధికారులు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఒక్క బ్లాక్ వద్ద ఇన్వెస్టిగేషన్స్ చేస్తే సరిపోదని, కచ్చితంగా మూడు బ్యారేజీల్లోని అన్ని బ్లాకుల్లోనూ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిందేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. లేదంటే పునరుద్ధరణ డిజైన్లు సాధ్యం కావంటున్నారు.
ఖర్చు కొండంత..
రిపేర్ల సంగతి అటుంచితే.. ఆ రిపేర్లకు అయ్యే ఖర్చుపైనా ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతున్నది. అగ్రిమెంట్ ప్రకారం డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లోనే బ్యారేజీలకు సమస్యలు తలెత్తడం, పనులు పూర్తికాకుండానే కంప్లీషన్ సర్టిఫికెట్స్ తీసుకోవడం వంటి కారణాలతో.. నిర్మాణ సంస్థలే బ్యారేజీలకు రిపేర్లు చేయాలని కరాఖండిగా చెప్పేసింది. ఎన్నో సార్లు అధికారికంగా లేఖలు రాసింది. ఏజెన్సీలతో సమావేశాలూ నిర్వహించింది. రిపేర్లు చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇలా ప్రతినెలా మూడు నాలుగు లేఖలు పంపుతున్నా.. నిర్మాణ సంస్థలు మాత్రం ప్రభుత్వ వార్నింగ్స్‌ను బేఖాతరు చేస్తున్నాయి.
మేడిగడ్డ ఏజెన్సీ ఎల్ అండ్ టీ.. కొత్తగా అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని మొండి చేస్తున్నదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మూడు బ్యారేజీల రిపేర్లకు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.1,200 కోట్ల దాకా ఖర్చవుతుందని చెబుతున్నారు. అందులో ఒక్క మేడిగడ్డకే రూ.700 కోట్లకుపైగా అవసరమవుతాయని అంటున్నారు. మరి, ఏజెన్సీలు ముందుకు రాకపోతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుదన్నది ఆసక్తికరంగా మారింది.
