ఎల్లుండి (జూలై 31) నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..ఆగస్టు 6 దాకా ఆరు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన

ఎల్లుండి (జూలై 31) నుంచి  మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..ఆగస్టు 6 దాకా ఆరు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రోగ్రామ్
  • ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్​లో సాయంత్రం పాదయాత్ర, పల్లె నిద్ర
  • మరుసటి రోజు శ్రమదానం.. ఆ తర్వాత నేతలతో మీటింగ్
  • రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభం
  • నేడు ఉమ్మడి జిల్లాల ఇన్​చార్జ్​లతో కీలక భేటీ

హైదరాబాద్, వెలుగు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో పాదయాత్రకు సిద్ధమవుతున్నది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. 7 రోజుల పాటు కొనసాగే ఈ పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. మొదటి విడతలో భాగంగా 6 ఉమ్మడి జిల్లాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుంది.

 రెండో విడతలో మిగిలిన జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. ఒక్కో ఉమ్మడి జిల్లాలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్​లో పాదయాత్ర ఉంటుంది. నియోజకవర్గంలో సాయంత్రం పాదయాత్ర చేసి.. రాత్రి పల్లె నిద్ర చేస్తారు. మరుసటి రోజు శ్రమదానంలో పాల్గొంటారు. అనంతరం ఆ జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం మరో అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్తారు. ఇలా ప్రతి సెగ్మెంట్​లో మీనాక్షి నటరాజన్ పర్యటిస్తారు. 

పాదయాత్రలో పీసీసీ చీఫ్, మంత్రులు

ఈ నెల 31న రంగారెడ్డి జిల్లా పరిగిలో సాయంత్రం 5 గంటలకు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. రాత్రి పార్టీ నేతలతో కలిసి అక్కడే పల్లె నిద్ర చేస్తారు. మరుసటి రోజు (ఆగస్టు1న) ఉదయం శ్రమదానం, మధ్యాహ్నం పార్టీ నేతలతో భేటీ అవుతారు. అదేరోజు మెదక్ జిల్లా అందోల్ లో సాయంత్రం పాదయాత్ర, ఆగస్టు 2న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో, 3న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్​లో, 4న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 5న వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పాదయాత్ర చేపట్టనున్నారు.

 ఆగస్టు 6న ఉదయం అక్కడే శ్రమ దానం, ఆ తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేడర్​కు దిశానిర్దేశం చేస్తారు. ఈ భేటీల్లో అక్కడి మంత్రితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్  నేతలు పాల్గొంటారు. కాగా, మంగళవారం ఉదయం 10.30‌‌‌‌‌‌‌‌ గంటలకు హైదరాబాద్ హైదర్​గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్​లో ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్​చార్జ్​లు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ అవుతారు. 

పాదయాత్ర షెడ్యూల్​పై వాళ్లతో చర్చించనున్నారు. కాగా, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, రాజ్​ఠాకూర్ సోమవారం గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ చేపట్టబోయే పాదయాత్ర మంచి కార్యక్రమం అని అన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించే అవకాశం ఉంటుందని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.