అయ్యో.. మీనాక్షి!..రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఆగని చర్చ 

అయ్యో.. మీనాక్షి!..రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఆగని చర్చ 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం ఇంకా చల్లారడం లేదు. ఆమెకు జరిగిన అన్యాయంపై పార్టీలకతీతంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. రాజకీయం అంటేనే అధికార దర్పం.. పదవి అంటేనే కోట్ల రూపాయల హంగామా నడుస్తున్న నేటి రోజుల్లో.. నిరాడంబరతకు, గాంధేయ సిద్ధాంతాలకు నిలువుటద్దంలా నిలిచే మీనాక్షి నటరాజన్ ప్రస్తుత అవకాశవాద రాజకీయాలకు బలయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లాల్సిన ఆమెను పక్కా ప్లాన్ ప్రకారం, సాంకేతిక కారణాలతో అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. ఒకవైపు బిలియనీర్లు, కార్పొరేట్ దిగ్గజాలు తమ ధన బలంతో పెద్దల సభలోకి సునాయాసంగా అడుగుపెడుతుంటే, నిఖార్సైన గాంధేయవాది  మీనాక్షికి అడ్డంకులు సృష్టించడం రాజకీయాల్లో ప్రజాస్వామిక, నైతిక విలువల పతనానికి పరాకాష్టగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 

అసలే కుట్ర.. ఆపై మైండ్​గేమ్​.. 

మీనాక్షి నటరాజన్  అఫిడవిట్‌‌ లో తనపై ఉన్న నేర సమాచారం దాచారంటూ భోపాల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్‌‌ ను తిరస్కరించడంతో ఈ వివాదం మొదలైంది. తెలంగాణలోని ఒక కోర్టు కేసుకు సంబంధించిన వివరాలు ఆమె వెల్లడించలేదని ఆర్వో సాకు చూపడం వెనుక  రాజకీయ కుట్ర ఉందనే  ఆరోపణలు వచ్చాయి. అందుకు తగినట్లే ఆమెపై నమోదైంది ఎఫ్ఐఆర్ కాదని, కేవలం ఒక ప్రైవేట్ ఫిర్యాదుపై అందిన నోటీసు మాత్రమేనని, దానిని కావాలనే కేసుగా చిత్రీకరించినట్లు తేలింది. అనంతరం ఆ పిటిషన్​ను సైతం విచారణకు స్వీకరించలేమని స్థానికకోర్టు చెప్పడంతో మీనాక్షిపై కేసు ఎగిరిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

 నిబంధనల ప్రకారం రెండేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న అంశాలనే అఫిడవిట్‌‌ లో వెల్లడించాల్సి ఉన్నా, అసంపూర్ణ సమాచారం అనే సాకుతో ఒక నిబద్ధత గల నేతను బరిలో లేకుండా చేయడం ద్వారా ఒక సీటును కాంగ్రెస్​ నుంచి లాక్కున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో ఈ నింద తమపైకి రాకుండా మధ్యప్రదేశ్​ బీజేపీ నేతలు ఆడిన మైండ్​గేమ్​మరో ఎత్తు!  మీనాక్షిపై కేసు ఉందనే లీకు తమకు తెలంగాణ కాంగ్రెస్ నేతల​ నుంచే వచ్చిందంటూ బీజేపీ ప్రజాప్రతినిధులు చెప్పడాన్ని బట్టి దీని వెనుక ఎంత వ్యూహరచన ఉందో అర్థమవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

సొంత ఇల్లు కూడా లేని మీనాక్షి.. 

సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి, కీలక పదవుల్లో పనిచేసినా మీనాక్షి నటరాజన్‌‌ కు నేటికీ సొంత ఇల్లు గానీ, సెంటు భూమి గానీ లేకపోవడం ఆమె నిబద్ధతకు నిదర్శనమని చాలామంది కొనియాడుతున్నారు. ఇప్పటికీ ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్స్‌‌ పోర్ట్‌‌ నే ఉపయోగిస్తూ, మాజీ ఎంపీగా వచ్చే పెన్షన్ తో సాధారణ జీవితం గడుపుతున్న ఆమెను ప్రస్తుత రాజకీయాలు భరించలేకపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పార్టీ ఇచ్చిన ఫండ్‌‌ లో మిగిలిన పైసాను తిరిగి వెనక్కి ఇచ్చి తన నిజాయతీ చాటుకున్న నేతకు చట్టసభల తలుపులు మూసేయడం ప్రజాస్వామ్యానికే అవమానకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద, అవకాశవాద రాజకీయాల ముందు విలువల రాజకీయం ఓడిపోతోందనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది.

పెద్దల సభలో నేరగాళ్లు, బిలియనీర్లకే పెద్దపీట.. 

ప్రస్తుత రాజ్యసభ ఎన్నికల సరళి ప్రజాస్వామ్యం కంటే ధనస్వామ్యానికే పెద్దపీట వేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)’ లెక్కల ప్రకారం.. రాజ్యసభ ఎంపీల్లో 73 నుంచి -75 మంది(33 శాతం) పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలోసుమారు 36 నుంచి -40 మంది(18 శాతం)పై హత్య, హత్యా యత్నం, మహిళలపై దాడులు మొదలైన తీవ్రమైన నేరాలున్నాయి.

 ఇక ఆర్థిక నేపథ్యం విషయానికి వస్తే రాజ్యసభలో 14శాతం(31 మంది) ఎంపీలు  రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న బిలియనీర్లే! ఫార్మా, ఇన్ ఫ్రా, తదితర రంగాలకు చెందిన  వీరంతా కేవలం డబ్బును ఎరవేసి రాజ్యసభకు రాగలిగారని ఏడీఆర్​ స్పష్టంచేసింది. ఇలాంటి నేరగాళ్లు, బిలియనీర్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థ, నిరాడంబరంగా బతికే మీనాక్షి వంటి వారు రాజ్యసభలోకి అడుగుపెట్టకుండా అడ్డుకోవడంపై పార్టీ కేడర్‌‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది.