గిరిపుత్రుల సమస్యలపై 34 నెలల తరువాత మీటింగ్

గిరిపుత్రుల సమస్యలపై 34 నెలల తరువాత మీటింగ్
  • గిరిపుత్రుల సమస్యలకు పరిష్కారమేదీ.?
  • నేడు భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశం
  • పోడు భూముల పట్టాలు, ఐదు పంచాయతీల విలీనంపై స్పందన కరువు
  • 34 నెలల తరువాత మీటింగ్, హాజరుకానున్న మంత్రులు​ పువ్వాడ, సత్యవతి రాథోడ్

భద్రాచలం,వెలుగు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ఐటీడీఏ ఆఫీసర్లు పూర్తిగా విఫలమవుతున్నారు. ఐటీడీఏ పాలకమండలి సమావేశాల్లో చేసిన తీర్మానాలు సైతం అమలుకు నోచుకోవడం లేదు. 2019 ఆగస్టు 13న జరిగిన సమావేశంలో ప్రతీ 3 నెలలకోసారి పాలకమండలి మీటింగ్​ నిర్వహించాలని తీర్మానం చేశారు. గిరిపుత్రుల సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించాల్సి ఉన్నా, 34 నెలల తర్వాత శుక్రవారం మీటింగ్​ పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలోనైనా ప్రధాన సమస్యలపై చర్చించి వాటిని వెంటనే పరిష్కరించేలా చూడాలని ఆదివాసీలు కోరుతున్నారు. నేడు భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి మీటింగ్​ నూతనంగా నిర్మించిన గిరిజన భవన్​లో నిర్వహిస్తున్నారు. సమావేశానికి మంత్రులు​పువ్వాడ అజయ్​కుమార్, సత్యవతి రాథోడ్​హాజరు కానున్నారు.

నేటికీ తీరని పోడు సమస్య..

పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని గత పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. కానీ నేటికీ ఆ సమస్య అలాగే ఉంది. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 31 మండలాల నుంచి 2,78,233.91 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ 70,785 అప్లికేషన్లు వచ్చాయి. కానీ 1,10,697.46 ఎకరాలకు మాత్రమే పట్టాలిచ్చి 38,347 అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. నేటికీ 1,67,504.45 ఎకరాలను సాగు చేస్తున్న గిరిజనులు పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై 13 ఏళ్లుగా ప్రతీ మీటింగ్​లో తీర్మానం చేసి వదిలేయడంతో ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు ఊళ్లపై పడి పోడు భూములను లాక్కొనేందుకు దాడులు చేస్తున్నారు. పంటలు ధ్వంసం చేసి కందకాలు తవ్వుతున్నారు. తిరగబడిన గిరిజనుల చేతులకు బేడీలు వేసి జైలుకు పంపుతున్నారు. చంటి పిల్లల తల్లులను, బాలింతలను సైతం వదల్లేదు. అక్రమకేసులు, వేధింపులు నిత్యకృత్యంగా మారుతున్నాయని వాపోతున్నారు. మణుగూరు ఎన్నికల సభలో పోడు సమస్యను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్​ హామీ ఇవ్వగా, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం మాయమాటలతో మభ్యపెట్టే  ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులు విమర్శిస్తున్నారు. సమస్య తీవ్రం కావడంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఊళ్లకు ఊళ్లు కదిలి వస్తున్నాయి. ప్రగతిభవన్​ను ముట్టడించే స్థాయికి ఉద్యమం చేరుకుంది.  

పంచాయతీల విలీనంపై పట్టింపు కరువు..

ఏపీలో విలీనమైన గుండాల, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, పిచ్చుకులపాడు, ఎటపాక పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేయాలనే తీర్మానంపై ఒత్తిడి చేసే వారే కరవయ్యారు. ప్రతీ మీటింగ్​లో తీర్మానం చేసి వదిలేస్తున్నారు. దీంతో భద్రాచలంలో కనీసం డంపింగ్​యార్డు ఏర్పాటుకు సెంటు భూమి దొరకని పరిస్థితి ఉంది. దీంతో చెత్తను గోదావరిలో కలిపేసి జల కాలుష్యం పెంచుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వారావుపేట, భద్రాచలం, ఖమ్మం, పినపాక, సత్తుపల్లి,వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లోని 7613 డబుల్​  బెడ్రూం​ఇండ్లు శాంక్షన్​ అయితే 4301 మాత్రమే పూర్తయ్యాయి. 1715 ఇండ్ల పనులు జరుగుతుంటే 1597 ఇండ్ల పనులు ఇంకా మొదలు కాలేదు. పూర్తయిన ఇండ్లను పేదలకు పంచడం లేదు. దీంతో లబ్ధిదారులే గృహ ప్రవేశాలు చేస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెంలలో ఎక్కడన్నా ఒక చోట డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు కోరినా పట్టించుకున్న వారు లేరు. చర్ల ప్రభుత్వ వైద్యశాలకు 108 కేటాయించాలని ప్రభుత్వ విప్​  రేగా కాంతారావు గత పాలకమండలి సమావేశంలో డిమాండ్​ చేశారు. కానీ నేటికీ అంబులెన్స్ మంజూరు కాలేదు. అయితే ఉన్న వాహనం రిపేరుకు వచ్చి రోగులను తరలించలేక అడవుల్లో ఆగిపోతోంది.  మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం ఏరియా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఒకరే ఉన్నారు. గతంలో నెలకు 400 కాన్పులు జరిగే ఈ ఆసుపత్రిలో ఇప్పుడు 150కు  మించడం లేదు.  

ఖర్చు చేశాం.. ఆమోదించండి..

నిధులొచ్చాక మీటింగ్​ పెట్టి ఎలా ఖర్చు చేయాలనే విషయంపై చర్చించి తీర్మానం చేస్తారు. అయితే భద్రాచలం ఐటీడీఏలో మాత్రం అమలు కావడం లేదు. 2019 ఆగస్టు 1 నుంచి ఈ ఏడాది జూన్​30 వరకు రూ.2.43 కోట్లు ఖర్చు చేశాం.. ఆమోదించండంటూ పాలకమండలి మీటింగ్​ అజెండాలో పెట్టారు. వీటితో పాటు ఐటీడీఏ పీవో, డీడీ సహా ఇతర ఆఫీసర్లకు కొత్త వెహికల్స్​ కొనుగోలుకు అనుమతితో పాటు విద్య, ఇంజనీరింగ్, ట్రైనింగ్స్​లకు మూడేళ్లుగా చేసిన ఖర్చుకు ఆమోదం తెలపాలని  అజెండాలో పెట్టారు.