కేసీఆర్కు వ్యతిరేకంగా గజ్వేల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం

కేసీఆర్కు వ్యతిరేకంగా గజ్వేల్లో  బీఆర్ఎస్  కార్యకర్తల సమావేశం
  • వేరే పార్టీల నుంచి వచ్చిన లీడర్లు మాపై ఆధిపత్యం చెలాయిస్తున్నరు
  • ఈనెల 20 లోగా సీఎం స్పందించాలి
  • లేకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కొండపాక, కుకునూరుపల్లి కార్యకర్తల అల్టిమేటం

కొండపాక/గజ్వేల్, వెలుగు: సీఎం కేసీఆర్​ ఈనెల 20 లోపు స్పందించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని గజ్వేల్  నియోజకవర్గంలోని కొండపాక, కుకునూర్​పల్లి మండల బీఆర్ఎస్  కార్యకర్తలు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం దుద్దెడ ఎల్లమ్మ ఆలయంలో సుమారు వంద మంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  కార్యకర్తలు సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ ఇప్పటిదాకా కేసీఆర్​ను తాము అత్యధిక  మెజారిటీతో  గెలిపించామన్నారు. కానీ నియోజకవర్గంలో ఇప్పుడున్న ముఖ్య లీడర్లంతా ఆయన ఓటమి కోసం పనిచేశారని అన్నారు. 

ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్  లోకి వచ్చి పదవులు పొందిన మండల ముఖ్య లీడర్లు తమపై పెత్తనం చెల్లాయిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తాము సీఎం నియోజకవర్గంలో ఉన్నప్పటికీ స్థానిక మంత్రి హరీశ్​రావు తమపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని వాపోయారు. పలు సందర్భాల్లో  ‘‘మీరు నాకు ఓట్లు వేసేవాళ్లు కాదు. మీతో నాకు సంబంధం లేదు’’ అనేలా వ్యవహరించారని చెప్పారు. సీఎం స్పందించకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టిస్తామని హెచ్చరించారు. 

ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ లీడర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, పీఏసీఎస్​ డైరెక్టర్లు పాల్గొన్నారు. అలాగే గజ్వేల్​ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్​ పార్టీ సంతృప్తులు, పలువురు సీనియర్​ నాయకులు ఆదివారం గజ్వేల్​ మండలంలోని రిమ్మనగూడలో గజ్వేల్ ​మున్సిపల్​మాజీ  చైర్మన్​ గాడిపల్లి భాస్కర్​ నేతృత్వంలో  ఆయన ఫామ్​హౌజ్ లో  భేటీ అయ్యారు. తమ భవిష్యత్  కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుతం బీఆర్ఎస్​లో తమకు ఎదురవుతున్న నిరాదరణపై చర్చించుకున్నారు. 

గాడిపల్లి భాస్కర్​ మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్​పార్టీకి శక్తివంచన లేకుండా కృషి చేసి కేసీఆర్​ను రెండు పర్యాయాలు గెలిపించుకున్నామని, అయినా తమను ఏనాడూ పట్టించుకోలేదని వాపోయారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు కేసీఆర్​అపాయింట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేదన్నారు. ఈ విషయాన్ని జిల్లా మంత్రి హరీశ్​ రావు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, పదేండ్లు అధికారంలో ఉన్నా పార్టీ కోసం కష్టపడ్డ తమకు ఎలాంటి గౌరవం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్​ టేకులపల్లి రాంరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.