
మెదక్ టౌన్, వెలుగు : సీజనల్ వ్యాధుల పట్ల సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా, మెదక్, అందోల్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్ కలిసి శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, ఫైలేరియా, డెంగీ, చికున్ గున్యా, వైరల్ ఫీవర్ గురించి మాట్లాడారు. మెదక్ నియోజకవర్గంలో మూడు డెంగీ పాజిటివ్ కేసులు రాగా, దుబ్బాక నియోజకవర్గంలో రెండు, అందోల్ నియోజకవర్గంలో ఒకటి కేసు, నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక కేసు నమోదయ్యాయని తెలిపారు.
ఈ కేసుల విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో చందూనాయక్, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్, సహాయ మలేరియా అధికారులు కుమారస్వామి, విజయేందర్, కమ్యూనిటీ హెల్త్ అధికారి రహీం పాషా ఉన్నారు.
అన్ని రకాల కేసులపై దృష్టి సారించాలి
మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల కేసుల్లో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్‌హాల్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత మూడు నెలల్లో 16 కేసులు నమోదు కాగా 8 కేసులు పెండింగ్ ట్రయల్స్‌కు, మరో 8 కేసులు ఇన్వెస్టిగేషన్ జరుగతున్నాయని తెలిపారు. ఈ కేసులను ఈనెలాఖరులోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ ఎఫ్ఐఆర్తో పాటు బాధితులకు రావాల్సిన ఆర్థిక సహాయం వెంటనే మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సరైన ఆధారాలతో ఇన్వెస్టిగేషన్ పూర్తిచేసి కంపెన్సేషన్ త్వరగా మంజూరయ్యేలా చూడాలన్నారు. అట్రాసిటీ కేసుల విషయంలో చార్జిషీట్ పూర్తయిన కేసులన్నీ కోర్టులో త్వరగా ప్రవేశపెట్టి హియరింగ్ వచ్చేలా చూడాలని చెప్పారు.
ఈ సందర్భంగా డీవైఎంసీ సభ్యులు పలు సూచనలు చేశారు. సివిల్ రైట్స్ డేలను ప్రతినెలా చివరి రోజున ప్రతి మండలంలో ఒక గ్రామంలో జరుపాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు విజయలక్ష్మి, జయరాజ్, మెదక్ డీఎస్పీ సైదులు పాల్గొన్నారు.