సెప్టెంబర్ 19 నుంచి కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు

సెప్టెంబర్ 19 నుంచి కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజు ముగిసింది. తొలిరోజు సమావేశాల అనంతరం ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. మంగళవారం (సెప్టెంబర్ 19) నుంచి పార్లమెంట్‌ కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి. లోక్‌సభ మంగళవారం (సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 1.15 గంటలకు సమావేశం కానుంది. ఇక రాజ్యసభ మధ్యాహ్నం 2.15 గంటలకు పార్లమెంట్‌ కొత్త భవనంలో సమావేశం కానుంది. మిగిలిన నాలుగు రోజుల పాటు కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేక సమావేశాలకు వేదిక కానుంది. ఈ సమావేశాల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారన్న అంశంపై ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ALSO READ: ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధమే : నితీశ్‌ కుమార్‌

ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం ప్రకటిస్తుందా...? అనే అనుమానం అన్ని పార్టీల్లోనూ ఉంది. తొలి రోజు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ సైతం పార్లమెంట్‌ ముందు మీడియాతో మాట్లాడారు. చారిత్రక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు చెప్పారు. పాత పార్లమెంటు సభలో మాట్లాడుతూ పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పలు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఆర్టికల్‌ 370 రద్దు, జీఎస్‌టీ, ఒకే దేశం - ఒకే పింఛను వంటి కీలక బిల్లులను ఇదే భవనంలో ఆమోదించామని గుర్తు చేశారు.