8 ఏండ్ల తర్వాత బిడ్డలను కలుసుకుంది

8 ఏండ్ల తర్వాత బిడ్డలను కలుసుకుంది

వరంగల్ క్రైం, వెలుగు: ఎనిమిదేండ్ల కింద మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి బయటికి వెళ్లి తప్పిపోయిన తల్లిని వాట్సాప్ బిడ్డల దగ్గరకు చేర్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ ​జిల్లా కేంద్రానికి చెందిన రేగళ్ల రాంరెడ్డి, -అమృతమ్మ దంపతులకు స్రవంతి, ప్రవీణ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం కొన్నేండ్ల కింద ఖమ్మం వెళ్లి చికెన్​సెంటర్ స్టార్ట్ ​చేశారు. 2013లో అమృతమ్మకు మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అమృతమ్మ పశ్చిమ బెంగాల్​లోని ముషీరాబాద్ జిల్లా బెల్డంగ స్వధార్​ హోంకు చేరింది. ఇటీవల అమృతమ్మ ఆరోగ్యం కుదుటపడి గతం గుర్తొచ్చింది. తనది మహబూబాబాద్ అని స్వధార్ హోం ఆఫీసర్లకు తెలిసింది. వాళ్లు ఆమె ఫొటోలను వరంగల్ కమిషనరేట్ కు పంపించారు. సీపీ తరుణ్​జోషి సూచనలతో పోలీసులు అమృతమ్మ ఫొటోలను వాట్సాప్ ​ద్వారా సర్క్యులేట్ చేశారు. వాటిని చూసిన రాంరెడ్డి పోలీసులను సంప్రదించాడు. సీపీ చొరవతో అమృతమ్మను వరంగల్​ తీసుకొచ్చి ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.