సిటీ పోలీసుల మెగా రక్తదాన శిబిరం .. ఒకే రోజు 4,427 యూనిట్ల రక్తం సేకరణ

సిటీ పోలీసుల మెగా రక్తదాన శిబిరం .. ఒకే రోజు 4,427 యూనిట్ల రక్తం సేకరణ
  •      ప్రారంభించిన డీజీపీ శివధర్​రెడ్డి 
  •     తలసేమియా రోగులకు అందజేస్తామన్న సీపీ సజ్జనార్​

హైదరాబాద్​ సిటీ, వెలుగు:  పోలీసు స్మారక వారం సందర్భంగా సిటీ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించింది. ఒక్క రోజులోనే కమిషనరేట్ అంతటా 4,427 యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. 12 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి 3,500 మంది దాతల నుంచి రక్తం సేకరించారు. 

పేట్లబుర్జులోని సిటీ ఆర్ముడ్​రిజర్వుడ్​హెడ్​క్వార్టర్స్​లో నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ బి.శివధర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. ప్రజలు ఏడాదికి కనీసం 2 నుంచి 4 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి.

 రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 8,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చాలా మందికి సకాలంలో రక్తం అందకనే తనువు చాలిస్తున్నారు’ అని చెప్పారు. సిటీ సీపీ వీసీ సజ్జనార్​మాట్లాడుతూ.. తలసేమియా రోగులకు ప్రతి15 రోజులకు ఒకసారి రక్తం అవసరం అవుతుందని, అందు కోసమే అమరవీరుల త్యాగాలకు నివాళిగా ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఈ శిబిరాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కమిషనర్​కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని  చెప్పారు. అడిషనల్ సీపీ (క్రైమ్) ఎం. శ్రీనివాస్, జాయింట్ సీపీ తఫ్సీర్, కార్​హెడ్​క్వార్టర్స్​డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, స్పెషల్​బ్రాంచ్​అపూర్వా రావు  పాల్గొన్నారు.