తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. తన సాలిడ్ యాక్షన్ మూవీ ' జన నాయగన్ ' ( Jana Nayagan ) సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ హెచ్. వినోద్ (H. Vinoth) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సారి 'జన నాయగన్' ఆడియోను మలేషియాలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
తమిళనాట 'దళపతి'గా తిరుగులేని స్టార్‌డమ్ అనుభవిస్తున్న విజయ్.. ఈ చిత్రంలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇది ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 'జన నాయగన్' విడుదల తేదీని ఖరారు చేయడంతో పాటు, చిత్రబృందం లేటెస్ట్ గా ఆడియో విడుదల కార్యక్రమం (Audio Launch Event) వివరాలను వెల్లడిస్తూ ఒక వీడియోను పంచుకుంది. ఈ వేడుక కేవలం చెన్నైలో కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో జరగనుంది!
డిసెంబరు 27న మలేషియాలోని కౌలాలంపూర్‌లోని చారిత్రాత్మక బుకిట్ జలీల్ స్టేడియం (Bukit Jalil Stadium)లో ఈ ఆడియో లాంచ్ వేడుకను నిర్వహించనున్నారు. ఏకంగా 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం గల ఈ భారీ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించడం ద్వారా, అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అర్థమవుతోంది. ఈ కార్యక్రమం విజయ్ సినిమాల ఆడియో ఫంక్షన్ల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
'జన నాయగన్' చిత్రం జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. సంక్రాంతికి వారం రోజుల ముందుగానే రావడం వల్ల, సినిమాకు వసూళ్ల సునామీ సృష్టించేందుకు ఎక్కువ సమయం దొరకనుంది. వినోద్-విజయ్ కాంబినేషన్, సంక్రాంతి సీజన్ నేపథ్యంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 'జన నాయగన్' గా నిలవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.
