మేఘా జెట్టి  తిరుగుతున్నది నిజమే

మేఘా జెట్టి  తిరుగుతున్నది నిజమే

నాగర్​ కర్నూల్​, వెలుగు: కృష్ణా నదిలో మేఘా కంపెనీకి చెందిన భారీ జెట్టి తెలంగాణ, రాయలసీమ మధ్య తిరుగుతున్నది వాస్తవమేనని.. అయితే అందులో తెలంగాణ ప్రాంతం నుంచి కంకర, ఇసుకను రాయలసీమ లిఫ్ట్​ ప్రాజెక్టుల కోసం తరలించడం లేదని రెవెన్యూ అధికారులు సర్టిఫై చేశారు. తెలంగాణ తీర ప్రాంతమైన కొల్లాపూర్ మండలం ఎల్లూరు రేగుమాను గడ్డ నుంచి మేఘా జెట్టీలో రాయలసీమ లిఫ్ట్​ పనులకు అవసరమైన యంత్రాలు, సామగ్రిని తరలించేందుకు సిద్ధంగా ఉంచగా వాటిని పరిశీలించారు. కంపెనీ ప్రతినిధుల వివరణతో సంతృప్తి చెందారు.  శుక్రవారం కొల్లాపూర్​ తహసీల్దార్  షౌకత్​ అలీ, రెవెన్యూ అధికారులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో మేఘా జెట్టీని పరిశీలించారు.  జెట్టీలో యంత్రాలు, ఇతర పరికరాలు మాత్రమే తరలిస్తున్నామని, ఇసుక, కంకర ముట్టుకోవడం లేదని అక్కడివారు చెప్పడంతో అధికారులు సంతృప్తి చెందారు. సోమశిలలో టూరిజం డిపార్ట్​మెంట్​కుచెందిన లాంచీ తిరగడానికి అనుమతులు లేవని అబ్జెక్షన్​ చెప్పిన ఫారెస్ట్​ అధికారులు మేఘా కంపెనీకి చెందిన భారీ జెట్టీ పగలు రాత్రి తేడా లేకుండా తెలంగాణ, ఏపీ మధ్య  కృష్ణానదిలో ఎలా తిరుగుతున్నదనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.  జెట్టీ నిలిపే ప్రాంతం వైపు కన్నెత్తి చూడటం లేదు. నిన్న మొన్నటి వరకు కృష్ణా నదిలో అసలు జెట్టీ తిరగడం లేదని దబాయించిన టీఆర్​ఎస్​ లీడర్లు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం అక్కడ జెట్టీ తిరుగుతున్నది నిజమేనని తేల్చి, ఇసుక, కంకర తరలిస్తలేరని చెప్పుకొచ్చారు. 

పర్మిషన్​పై దాగుడు మూతలు 

కృష్ణా నదిలో భారీ పడవలు, జెట్టీల రవాణాకు అనుమతులు ఇవ్వకూడదు. అయినా తెలంగాణ నుంచి రాయలసీమ లిఫ్ట్​ పనులకు పగటి పూటే యంత్రాలు, టిప్పర్లు, ఆయిల్​ డ్రమ్ములు తరలిస్తున్న  మేఘా కంపెనీ భారీ జెట్టి రాకపోకల పర్మిషన్​పై రెవెన్యూ, ఇరిగేషన్​, ఫారెస్ట్​ ఆఫీసర్లు నోరు విప్పడం లేదు. ఇప్పటికీ ‘చూస్తాం’ అనే మాట తప్పిస్తే తీసుకున్న చర్య లేమిటో చెప్తలేరు. వివరణ కోసం ప్రయత్నిస్తే పెద్ద ఆఫీసర్ల మొబైల్ ​ఫోన్లు స్విచ్చాఫ్​ వస్తున్నాయి. రాయలసీమకు తిప్పుతున్న జెట్టీని రాత్రి పూట పరిశీలిస్తే అందులో  ఏం తరలిస్తున్నారోనన్న విషయం బయట పడుతుందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ అధికారులు మేఘా కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారే తప్ప మత్స్యకారులు, చెంచుల బతుకుదెరువు గురించి పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.