మెగాస్టార్ చిరంజీవి , మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. ఈ మూవీ 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు ప్రమోషనల్ అప్డేట్ లు రోజు రోజుకూ ఈసినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తోంది. అదే చిరంజీవి, వెంకటేష్ కలిసి చేస్తున్న స్పెషల్ సాంగ్..
ఇద్దరు దిగ్గజాలు.. ఒకే పాట!
టాలీవుడ్‌లో అత్యంత అరుదైన , సంచలనం సృష్టించే కలయికలలో ఒకటైన చిరంజీవి-వెంకటేష్ కాంబో ఈ పాటతో మరోసారి రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ డ్యాన్స్ లో చిరంజీవి, వెంకటేష్‌తో పాటు 500 మందికి పైగా డ్యాన్సర్స్ పాల్గొంటున్నారు. ఈ స్టైలిష్ మాస్ డ్యాన్స్ సాంగ్‌కు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా, పొలకి విజయ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఫోటో
తాజాగా ఈ పాట షూటింగ్ సెట్ నుండి చిరంజీవి, వెంకటేష్ కలిసి పోజులిచ్చిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం వెంకటేష్ రాకను ఒక వీడియో ద్వారా ప్రకటిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి , విక్టరీ వెంకటేష్ లను ఒకే తెరపైకి తీసుకురావడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భం పోస్ట్ చేశారు. 'మన శంకరవరప్రసాద్‌గారు' అన్ని కుటుంబాలకు ఒక పండగ. ఈ ఆనందాన్ని సంక్రాంతి 2026 న మీతో పంచుకోవడానికి వేచి ఉండలేను అని ట్వీట్ చేశారు.
వెంకీ పాత్రపై ఊహాగానాలు
ఈ చిత్రంలో చిరంజివీతో పాటు వెంకటేష్ హై ఎనర్జీ డ్యాన్స్ నంబర్ లో భాగం కావడం చూస్తుంటే.. ఆయన పాత్ర అతిథి పాత్ర కంటే ఎక్కువే ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, క్యాథరిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ , వీటీవీ గణేశ్ వంటి ప్రముఖులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి , సుస్మితా కొణిదెల సంయుక్తంగా 'షైన్ స్క్రీన్స్','గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్ల కింద అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుని 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది.
