Chiranjeevi WEF: దావోస్‌లో అనూహ్య భేటీ.. గ్లోబల్ స్టేజ్‌పై సీఎం రేవంత్‌తో మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi WEF: దావోస్‌లో అనూహ్య భేటీ.. గ్లోబల్ స్టేజ్‌పై సీఎం రేవంత్‌తో మెగాస్టార్ చిరంజీవి

ప్రపంచ ఆర్థిక వేదిక అయిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సు 2026 స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉండగా, మెగాస్టార్ చిరంజీవి జ్యూరిచ్‌లో ఉన్న విషయం ఆయనకు తెలిసింది. వెంటనే మెగాస్టార్‌ను దావోస్ సమ్మిట్‌కు ఆహ్వానించగా, ఆ ఆహ్వానాన్ని గౌరవంగా స్వీకరించిన చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సదస్సుకు హాజరయ్యారు.

‘తెలంగాణ రైజింగ్ 2047’ ఆవిష్కరణకు సాక్ష్యం

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ ప్రజెంటేషన్‌కు మెగాస్టార్ చిరంజీవి సాక్షిగా నిలిచారు. ఈ క్షణం తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని, సంస్కృతి వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పిన గర్వకారణమైన ఘట్టంగా నిలిచింది. 

చిరంజీవికి ఆత్మీయ స్వాగతం

సమ్మిట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఎంతో ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “మన శంకర వర ప్రసాద్ గారు” చిత్రాన్ని తన కుటుంబంతో పాటు మనవళ్లతో కలిసి చూసినట్లు తెలిపారు. ఆ సినిమా ఎంతో వినోదభరితంగా ఉందని ప్రశంసిస్తూ, చిరంజీవిపై తన అభిమానాన్ని వ్యక్తిగతంగా తెలియజేశారు.

అనూహ్య భేటీ.. ఆత్మీయ సంభాషణలు

స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ భేటీ అనూహ్యమైనదే అయినప్పటికీ, ఇరు ప్రముఖుల మధ్య ఆత్మీయ సంభాషణలు, పరస్పర గౌరవం కనిపించాయి. 2026 దావోస్ సమ్మిట్ సందర్భంగా ఇద్దరూ కలిసి కొంత సమయం గడిపి, స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు.

ఫ్యామిలీ వెకేషన్లో చిరంజీవి

వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి ఫ్యామిలీ వెకేషన్ నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఆ ప్రయాణంలో భాగంగానే ఈ ప్రత్యేకమైన సమావేశం, అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై పాల్గొనే అరుదైన అవకాశం దక్కింది.

మన శంకరవరప్రసాద్ గారు:

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్భంగా తన చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.