కోర్టు ఆదేశాలిచ్చినా.. ఇంకా నాపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నరు. మరోసారి పోలీసులకు చిరంజీవి కంప్లైంట్

కోర్టు ఆదేశాలిచ్చినా.. ఇంకా  నాపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నరు. మరోసారి పోలీసులకు చిరంజీవి కంప్లైంట్

మెగాస్టార్ చిరంజీవి  మరోసారి  హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.  సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై అభ్యంతకరంగా కామెంట్స్ చేసిన దయా చౌదరి అనే  ఎక్స్ హ్యాండిల్ ప్రొఫైల్స్ ను జోడిస్తూ ఫిర్యాదు చేశారు.  సిటీ సివిల్ కోర్ట్ తీర్పు ఇచ్చినా..  ఇంకా  తనపై ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసు  నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ఇటీవలే  మెగాస్టార్​చిరంజీవి డీప్​ఫేక్​బారిన పడిన సంగతి తెలిసిందే... కొందరు సైబర్​క్రిమినల్స్​డీప్​ఫేక్​సహాయంతో ఆయన అశ్లీల చిత్రాల్లో నటించినట్టు వీడియోలు క్రియేట్​చేసి పలు వెబ్​సైట్లలో పోస్ట్​చేశారు.  తన పేరు, రూపం ఉపయోగించి డీప్‌‌‌‌ఫేక్ సాయంతో కొందరు అశ్లీల వీడియోలు తయారు చేసి పోర్న్ సైట్లలో పోస్ట్​చేస్తున్నారని, వాటిని తొలగించాలని సిటీ సివిల్​కోర్టును సెప్టెంబరులో ఆశ్రయించారు. దీంతో కోర్టు అదే నెల 26న ఆయా వెబ్​సైట్లలో కంటెంట్​తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ వేదికలపై మెగాస్టార్ చిరంజీవి, అన్నయ్య పేర్లతో  ఏఐ మార్ఫింగ్‌‌ చేయడంపై కూడా ఆంక్షలు విధించింది. 

అయితే మళ్లీ అక్టోబర్ 27న చిరంజీవి డీప్​ఫేక్​వీడియోలు క్రియేట్​చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని సైబర్​క్రైమ్​పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ‘ఓ మహిళతో  తాను లైంగిక చర్యల్లో పాల్గొన్నట్టు వీడియోలు సృష్టించి కొన్ని ప్లాట్‌‌‌‌ఫామ్స్​లో పోస్ట్​చేశారు. అవి పూర్తిగా ఏఐ డీప్‌‌‌‌ఫేక్ ద్వారా తయారు చేసినవి. ఈ వీడియోలు నా గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించుకున్న మంచిపేరును చెడగొడుతున్నాయి. అలాంటి వెబ్​సైట్లు ఒకదానికొకటి కంటెంట్‌‌‌‌ను షేర్​చేసుకుంటూ రీపోస్ట్ చేస్తున్నాయి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఈ క్రమంలో తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారని చిరంజీవి మరోసారి ఫిర్యాదు చేయడం చర్చనీయంశంగా మారింది.