సినీ పరిశ్రమలోకి కొత్త తరం రావాలి

సినీ పరిశ్రమలోకి కొత్త తరం రావాలి

సరైన కంటెంట్‌తో సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినిమాలో కంటెంట్ లేకుంటే రెండో రోజే కనుమరుగైపోతుందని చెప్పారు. ఈ మధ్యకాలంలో అలాంటి బాధితుల్లో తాను కూడా ఒకడినని ఆయన గుర్తు చేసుకున్నారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అయిన ఈ సినిమా రేపు (సెప్టెంబరు 2న) రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజయ్యారు. 

ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ తనను ఎంతో పెద్ద వాణ్ణి చేసిందని అన్నారు. సినీ రంగాన్ని వదిలి కొన్నాళ్లు వేరే రంగానికి వెళ్లానని.. తిరిగొచ్చాకే సినీ పరిశ్రమ విలువ మరింత తెలిసిందని చిరు చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోకి కొత్త తరం రావాలి అన్నారు. ఆడబిడ్డలు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని.. తన ఇంటి నుంచి కూడా ఆడబిడ్డలు పరిశ్రమలో రాణిస్తున్నారని తెలిపారు. సినీ పరిశ్రమలో మహిళలకు ఎంతో గౌరవం ఉందన్నారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది పరిశ్రమ అపోహ మాత్రమే.. మంచి కంటెంట్ వస్తే ఆస్వాదించడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని చిరు అన్నారు. దర్శకులు సినిమా విడుదలపై కాకుండా మంచి కథలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రేక్షకులకు ఏది అవసరమో వాటిపైనే దర్శకులు దృష్టి సారించాలన్నారు. నటీనటుల డేట్స్ క్లాష్ అవుతున్నాయని కంగారు కంగారుగా షూటింగ్స్ చేయొద్దు చిరు కోరారు.