భారతీయులంతా గర్వించదగ్గ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’

భారతీయులంతా గర్వించదగ్గ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’

చిరంజీవి హీరోగా సురేందర్‌‌‌‌ రెడ్డి రూపొందించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్​ చరణ్‌‌ నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘ఇంత గొప్ప చారిత్రాత్మకమైన సినిమా వస్తోందంటే మొదట కృతజ్ఞతలు చెప్పాల్సింది పరుచూరి బ్రదర్స్‌‌కి. వాళ్లు ఎన్నేళ్లు ఈ సబ్జెక్ట్‌‌ని గుండెల మీద మోశారో ఇండస్ట్రీ మొత్తం తెలుసు. దాదాపు ఇరవయ్యేళ్ల తర్వాత వారి కోరికను చరణ్‌‌ తీరుస్తున్నాడు. ఇది తను వాళ్ల నాన్నగారికే కాదు, తెలుగువాళ్లందరికీ ఇస్తున్న గిఫ్ట్. ఇలాంటి సినిమా తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ‘బాహుబలి’లో రెండు వేల మూడొందల వీఎఫ్‌‌ఎక్స్ షాట్స్‌‌ ఉంటే ‘సైరా’లో మూడు వేల ఎనిమిది వందల షాట్స్‌‌ ఉన్నాయని వీఎఫ్‌‌ఎక్స్ సూపర్‌‌‌‌వైజర్ చెప్పారు. అన్ని  వేల షాట్స్ మధ్య ఎమోషన్స్‌‌ని మర్చిపోకుండా సినిమాని తీర్చిదిద్దడం చిన్న విషయం కాదు. ఈ సినిమాను ఇంత బాగా తీసిన సురేందర్‌‌‌‌ రెడ్డికికంగ్రాట్స్. మగధీర చూసిన తర్వాత ఇలాంటి సినిమా నేనింతవరకూ చేయలేదు అన్నారు చిరంజీవి గారు. ఆయన కోరికను ఇప్పుడు చరణ్‌‌ తీర్చాడు’ అన్నారు.

రామ్‌‌చరణ్ మాట్లాడుతూ ‘నాలో ఉన్న భావాలను చెప్పడానికి మాటలు సరిపోవు. టీమ్‌‌ అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. వాళ్లు కనుక లేకపోతే నాన్నగారి కలను నెరవేర్చడం వీలయ్యేది కాదు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను’ అన్నారు. ‘టీమ్ అందరం కలిసి ఒక కుటుంబంలా పని చేశాం. వారి సహకారానికి కృతజ్ఞతలు. తన డ్రీమ్‌‌ ప్రాజెక్ట్‌‌ని డైరెక్ట్ చేసే అవకాశమిచ్చినందుకు చిరంజీవి గారికి, రామ్‌‌ చరణ్‌‌ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను’ అన్నారు డైరెక్టర్ సురేందర్‌‌‌‌ రెడ్డి. వీవీ వినాయక్ మాట్లాడుతూ ‘తెలుగు సినిమా రారాజు మా అన్నయ్య చిరంజీవి గారు. ఈ సినిమా అన్నయ్యకి, చరణ్‌‌ బాబుకి గుర్తుండిపోయే సూపర్‌‌‌‌ హిట్‌‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘తండ్రి నిర్మాత అయితే కొడుకు యాక్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ కొడుకు నిర్మించిన సినిమాలో తండ్రి నటించడమనేది చూడటానికి ఎంతో బాగుంది. చిత్రీకరణ దశలో ఉండగానే ఇంత పాజిటివ్ బజ్‌‌ ఏ సినిమాకీ ఉండివుండదు. సినిమా తప్పకుండా సూపర్‌‌‌‌ హిట్ అవుతుంది’ అన్నారు కొరటాల శివ.

తండ్రి కలను నెరవేర్చి ఒక కొడుకు ఎలా ఉండాలనే విషయంలో మా అందరికీ చరణ్ ఉదాహరణగా నిలిచాడు అని సాయి ధరమ్‌‌ తేజ్ అంటే… మెగా అభిమానులే కాదు ప్రతి భారతీయుడూ గర్వపడే సినిమా అవుతుందని వరుణ్‌‌ తేజ్ అన్నాడు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘దీనికి పని చేసినవారు కాకుండా, ఈ సినిమా చూసిన మొట్టమొదటి ప్రేక్షకుడిని నేనే. ఇంత కష్టపడి, ఇన్నేళ్లు తీశారు ఎలా వచ్చిందో అనే భయంతో చూశాను. చూసిన తర్వాత లేచి చిరంజీవి గారిని వాటేసుకున్నాను. ఆయనకి ఇన్ని సినిమాలు ఇచ్చాను కానీ ఇలాంటి సినిమా ఇవ్వలేకపోయానే అని కాస్త బాధ కలిగింది. చిన్నవాడైనా చరణ్‌‌ ఇచ్చినందుకు నా కడుపు నిండిపోయింది’ అన్నారు. ‘ట్రైలర్‌‌‌‌కి వచ్చిన హైప్ చూసి చిరంజీవి గారికి కాల్ చేశాను. ఆ అంచనాలను తప్పకుండా అందుకుంటామని ఆయన కాన్ఫిడెంట్‌‌గా చెప్పారు. ఇంతమంది గొప్పవాళ్లు కలిసి తీసిన ఈ సినిమా సూపర్‌‌‌‌ హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అన్నారు జగపతి బాబు.

ఇంకా ఈ కార్యక్రమంలో  చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు పరుచూరి బ్రదర్స్, మెహర్ రమేష్, సురేష్‌‌బాబు, డీవీవీ దానయ్య, బీవీఎస్​ఎన్​ ప్రసాద్,  బుర్రా సాయిమాధవ్, భూపతిరాజా, ఫైట్ మాస్టర్స్​ రామ్​-–లక్ష్మణ్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్​ శ్రీకర్‌‌‌‌ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఏళ్ల పాటు మనసులో మెదిలిన కథ: చిరంజీవి

ఈ రోజు నా జీవితంలో ఒక అద్భుతమైన ల్యాండ్‌ మార్క్. 1978,సెప్టెంబర్‌‌ 22న నా మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది. నా సినిమా బైటికెళ్తోంది, అందరూ నా గురించి ఏమనుకుంటారు, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే మీమాంసలో ఉన్నాను ఆ రోజంతా. అలాంటి ఉద్విగ్నత, ఎక్సయిట్‌మెంట్, టెన్షన్‌ నలభయ్యొక్క సంవత్సరాల తర్వాత మళ్లీ ఈరోజు ఫీలవుతున్నాను.

ఏ కథయినా అప్పటికప్పుడు అనుకుంటాం, అల్లుకుంటా, తీస్తాం, అంతటితో అయిపోతుంది. కానీ ఇది అలాంటి కథ కాదు. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు నా మనసులో మెదులుతూ ఉంది. మీరు చేయాల్సిన అద్భుతమైన పాత్ర ఏదైనా ఉందా అని ఎవరైనా అడిగితే భగత్‌సింగ్ పాత్ర చేయాలనుందని చెబుతాను నేను. కానీ ఆ కథను ఇంతవరకూ ఎవరూ తీసుకు రాలేదు. దాంతో ఆ కోరిక అలానే ఉండిపోయింది. అయితే పుష్కరకాలం ముందు పరుచూరి బ్రదర్స్‌ నరసింహారెడ్డి పాత్ర నేను చేస్తే బాగుంటుందని చెప్పారు. కనుమరుగైపోయిన ఆ యోధుడి చరిత్రను మన దేశమంతా తెలిసేలా చేయాలనిపించింది. కానీ తీయడానికి బడ్జెట్‌ ప్రాబ్లెమ్ వచ్చింది. దాంతో అది అలా ఆగిపోయింది.

మళ్లీ ఇన్నాళ్లకి దీన్ని నా 151వ సినిమాగా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఒక రకంగా దర్శకుడు రాజమౌళి. ఆయన ‘బాహుబలి’ తీసుండకపోతే ఈ సినిమా వచ్చుండేది కాదు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా నిర్మాతకు నష్టం రాదనే భరోసా ఇచ్చారాయన. ఎంతయినా రిస్క్ ఉంటుంది కనుక వేరే వాళ్లను ఇబ్బంది పెట్టకుండా నేనే చేస్తానన్నాడు చరణ్.  ఇలాంటి సినిమా తీయాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి కనుక సురేందర్‌‌ రెడ్డి అయితే కరెక్టనుకున్నాం. ఒక యదార్థగాథని ఎక్కడా వక్రీకరించకుండా కమర్షియలైజ్ చేసిన విధానానికి ఆయన్ని మెచ్చుకుని తీరాలి.  ఈ సినిమా చేయాలంటే శారీరకంగా కూడా చాలా శక్తి కావాలి. నేను డూప్​ని యాక్సెప్ట్ చేయలేను. కానీ ఒక్కసారి గెటప్ వేసి, కత్తి పట్టి, గుర్రమెక్కానంటే అన్నీ మర్చిపోయేవాడిని.పాతికేళ్ల క్రితం ఏ జోష్‌తో చేశానో అదే జోష్‌తో చేశాను. తీసినవారికి,  పని చేసినవారికి చాలా తక్కువ సినిమాలు గౌరవాన్ని తీసుకొస్తాయి.

ఒకప్పుడు అలాంటి గౌరవాన్ని ‘శంకరాభరణం’ సినిమా తీసుకొస్తే, చాలా సంవత్సరాల తర్వాత ‘బాహుబలి’ తీసుకొచ్చింది. అలాంటి గౌరవాన్ని ఈ సినిమా కూడా తీసుకొస్తుందనే నమ్మకం నాకుంది. భారతీయులందరూ గర్వించదగ్గ సినిమా ఇది. ఇలాంటి సినిమాను నిర్మించి నందుకు చరణ్‌ని అభినందిస్తున్నాడు. ఒక కొడుకుగా కాదు, నిర్మాతగా.  ఎంత మిగిలిందనేది ముఖ్యం కాదు, ఎంతమంది శభాష్ అంటారు అన్నదే ధ్యేయంగా ఈ సినిమా తీశారు చరణ్, సురేందర్. వాయిస్​ ఓవర్​ ఇవ్వమని అడిగితే తమ్ముడు కూడా ఎంతో ఆనందంగా సరే అన్నాడు.

నటీనటులు కూడా ప్రాణం పెట్టి చేశారు. ఒక్క ఫోన్ కాల్‌తో అమితాబ్ ఓకే అన్నారు. కన్నడ సూపర్​స్టార్​ సుదీప్‌ తన పాత్ర నిడివి ఎంత అని కూడా అడగలేదు. రెండేళ్ల వరకూ డేట్స్‌ దొరకనంత బిజీ అయినా ఈ సినిమా కోసం సమయం వెచ్చించాడు విజయ్ సేతుపతి. ఇంకా జగపతిబాబు, నయనతార, తమన్నా, పృథ్వీ లాంటి వారంతా కూడా సపోర్ట్​గా నిలబడ్డారు. అద్భుతంగా నటించారు. వారికి, ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను.

గర్వంగా వాయిస్ ఇచ్చా!

అన్నయ్య సినిమా ఫంక్షన్స్​కి వచ్చినప్పుడు నేనో అతిథిలా భావించను. ఆయన అభిమానుల్లో ఒకడిగా ఫీలవుతాను. ఈ రోజు ఇంతమంది అభిమానం నాకు దక్కిందంటే ఆయన నాకు నేర్పించిన పాఠాల వల్లే. ఆ మధ్య ఇంటర్‌‌ విద్యార్థులు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వార్త వినగానే నాకు అన్నయ్య గుర్తొచ్చాడు. ఎందుకంటే ఇంటర్‌‌ ఫెయిలైనప్పుడు నేను షూట్ చేసుకుని చనిపోవాలనుకున్నాను. అప్పుడు మా వదిన, చిన్నన్నయ్య నన్ను అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు అన్నయ్య ఈ పరీక్షలో ఓడిపోవడం పెద్ద విషయం కాదు, నువ్వు జీవితంలో గెలవడమే నాకు ముఖ్యం అన్నారు. ఆ రోజు ఆయన ఇచ్చిన గుండె ధైర్యమే ఈరోజు నన్నిలా నిలబెట్టింది. అన్నయ్య లాంటి వ్యక్తి ఆ బిడ్డల వెనుక ఉండివుంటే వాళ్లు చనిపోయేవారు కాదు కదా అనిపించింది. అన్నయ్య దేశం గర్వించదగ్గ సినిమాలు చేయాలని కోరుకున్నాను. కానీ నాకు స్టార్‌‌డమ్ వచ్చినా ఆయనతో అలాంటి సినిమా తీయలేకపోయాను. చిన్నవాడైనా చరణ్‌ ఆ పని చేశాడు. తన స్వార్థం చూసుకోకుండా కోట్లు ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు తనని అభినందిస్తున్నాను. ఇది మన దేశపు గొప్పదనాన్ని తెలిపే సినిమా.

చరిత్ర చూసుకుంటే ఎన్నో దేశాలు మన దేశం మీద దాడి చేశాయి కానీ మన దేశం ఏ దేశంపైనా దాడి చేయలేదు. అంత గొప్ప దేశం మనది. అసలు దేశమంటే ఏమిటి? ఉయ్యలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహమే. ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. వాళ్లలో నరసింహారెడ్డి ఒకరు. ఆయన గురించి  కోట్లాదిమంది తెలుసుకోవాలంటే సినిమాగా తీయాలి. అలాంటి సినిమా అన్నయ్య చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి వాయిస్​ ఇవ్వమని అడిగినప్పుడు నేను వెంటనే సరే అన్నాను. ఇది నా దేశం కోసం, ప్రజల కోసం తీసిన సినిమా కనుక ఎంతో గర్వంగా ఇచ్చాను. భారతీయులు గర్వించే సినిమా తీసిన టీమ్‌ మొత్తానికీ నా అభినందనలు.