మేఘా, నవయుగకే 20 వేల కోట్ల‌ పనులు

మేఘా, నవయుగకే 20 వేల కోట్ల‌ పనులు

కాళేశ్వరం అదనపు టీఎంసీ
తరలింపు పనుల టెండర్లు వాటికే!
బిడ్లు వేసింది ఈ రెండు సంస్థలే
హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ నీళ్ల తరలింపు పనుల టెండర్ల‌ను మేఘా, నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీలే దక్కించుకోనున్నాయి. ఎల్లంపల్లినుంచి మిడ్‌‌ మానేరుకు, మిడ్ ‌‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌‌వరకు అదనంగా మరో టీఎంసీ నీళ్ల‌ను తరలించే పనులు చేపట్టేందుకు రూ.21 వేల
కోట్ల అంచనాతో సర్కారు టెండర్లు పిలిచింది. వీటికి సంబంధించిన టెక్నికల్ ‌‌బిడ్లను బుధవారం జలసౌధలో ఇంజనీర్లు ఓపెన్ ‌‌చేశారు. ఎనిమిది ప్యాకేజీలుగా విభజించిన ఈ పనుల్లో.. దాదాపు రూ.20 వేల కోట్ల పనులకు ఈ రెండు సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి.

మే 5వ తేదీన ప్రైస్‌ బిడ్లను ఓపెన్‌ చేయనున్నారు. అప్పుడు ఏ ప్యాకేజీ పనులు.. ఎవరు.. ఎంతకి చేజిక్కించుకున్న విషయాల్లో క్లారిటీ రానుంది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌‌మానేరు వరకు చేపట్టే నాలుగు ప్యాకేజీలు, మిడ్ ‌‌మానేరు నుంచి మల్లన్నసాగర్ ‌‌వరకు చేపట్టే పనులను మరో నాలుగు ప్యాకేజీలుగా విడగొట్టారు. మేఘా, నవయుగ, ప్రతిమ, కేఎన్‌‌ఆర్‌‌, కావేరి, సీ5, ఎంఎస్‌‌ఆర్ ‌‌ఏజెన్సీలు బిడ్లు దాఖలు చేశాయి. ఒక్కో ప్యాకేజీకి రెండు వర్క్ ‌‌ఏజెన్సీలకు మించి టెండర్లు వేయలేదు.

సీతారామ టెండర్ల గడువు మే12 వరకు పొడిగింపు

సీతారామ లిఫ్ట్ ‌స్కీమ్‌‌స్టేజ్‌‌ -2, సీతమ్మ సాగర్‌‌(దుమ్ముగూడెం) టెండర్ల గడువును మే 12వ తేదీ వరకు పొడిగించారు. ఈ నెల 22వ తేదీతోనే బిడ్ల దాఖలుగడువు ముగియగా టెండర్‌ నోటిఫికేషన్‌‌పై తమకు సమాచారం లేదని ప్రధాన వర్క్ ‌‌ఏజెన్సీలు చెప్పడంతో గడువును బుధవారం వరకు పొడిగించారు. లాక్‌‌డౌన్ ‌కారణంగా టెండర్ల దాఖలు గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. సీతారామ లిఫ్ట్ ‌‌స్కీమ్ ‌స్టేజ్‌‌ -2 పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి రూ.1,238.05 కోట్లతో, దుమ్ముగూడెం మల్టీ పర్పస్ ‌బ్యారేజీకి రూ.2,632.77 కోట్లతో ఇరిగేషన్‌ డిపార్ట్ మెంట్ ‌‌టెండర్లు పిలిచింది.