కశ్మీర్ బహిరంగ జైలులా తయారైంది

కశ్మీర్ బహిరంగ జైలులా తయారైంది

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. అందుకు ఎంతకాలం పట్టినా వెనక్కి తగ్గబోమన్నారు. ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పైవ్యాఖ్యలు చేశారు.  ఆర్టికల్ 370, 35 (ఏ)ను పునరుద్ధరించేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. 

‘జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35 (ఏ)ను పునరుద్ధరించేంత వరకు మా పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోదు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ ప్రక్రియ మొదలవ్వాలి. దీని కోసం మేం పోరాడతాం. దీన్ని సాధించేంత వరకు గుప్కర్ కూటమి కలసి పని చేస్తుంది. భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను తిరిగి పొందాలన్నదే మా కోరిక. ఓటు ప్రయోజనాల కోసం ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా భారత రాజ్యాంగాన్ని వాళ్లు (మోడీ సర్కార్) అవమానించారు’ అని మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘జమ్మూ కశ్మీర్ ఇప్పుడో బహిరంగ జైలులా తయారైంది. ప్రజలెవరైనా తమ నోళ్లు తెరిచి మాట్లాడితే చాలు జైళ్లలో వేస్తున్నారు. జనాలు తమ ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే వారంతలా భయపడుతున్నారు. అక్కడ వ్యాపారాలు పడిపోయాయి. కశ్మీరీ యువత నైరాశ్యంలో ఉంది. బాధల్లో ఉన్న ప్రజలకు సాంత్వన చేకూర్చాలన్నదే కేంద్ర ప్రభుత్వానికి నేను అడిగే ఏకైక కోరిక’ అని మెహబూబా విజ్ఞప్తి చేశారు.