ICC Player of Month: ఐపీఎల్‌తో ప్రపంచ క్రికెట్ బిజీ బిజీ.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న బంగ్లాదేశ్ ఆల్ రౌండర్

ICC Player of Month: ఐపీఎల్‌తో ప్రపంచ క్రికెట్ బిజీ బిజీ.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న బంగ్లాదేశ్ ఆల్ రౌండర్

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహిదీ హసన్ మీరాజ్ 2025 ఏప్రిల్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనకు గాను ఈ బంగ్లా ఆల్ రౌండర్ కు ఐసీసీ అవార్డు వరించింది. నామినీలుగా ఎంపికైన జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ, న్యూజిలాండ్‌కు పేసర్ బెన్ సియర్స్‌లను ఓడించి ఈ అవార్డు గెలుచుకున్నాడు. మెహదీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకోవడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ తరపున ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్. 

"ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం అద్భుతమైన గౌరవం.  2016 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికవడం నా కెరీర్ ప్రారంభంలో గొప్ప మలుపు. ఈ అవార్డు కూడా అంతే ప్రత్యేకమైనదిగా అనిపిస్తుంది. ఐసీసీ  నుండి ఇలాంటి గుర్తింపు నా దేశం కోసం మరింత కష్టపడి, నిలకడ ప్రదర్శన ఇవ్వడానికి నన్ను ప్రేరేపిస్తుంది. నా సహచరులు, కోచ్‌లు,  అభిమానులకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఈ అవార్డు వారందరికీ కూడా చెందుతుంది" అని మెహదీ హసన్ ఒక ప్రకటనలో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

జింబాబ్వే సిరీస్‌లో మీరాజ్ అద్భుతంగా రాణించాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి ఆల్ రౌండర్ గా అదరగొట్టాడు. టెస్ట్ సిరీస్‌లో  38.66 సగటుతో 116 పరుగులు చేయడమే కాకూండా 11.86 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు.సిల్హెట్‌లో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ.. మెహిదీ రెండు ఇన్నింగ్స్ ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగులకు 5 వికెట్లు.. రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. 

చట్టోగ్రామ్‌లో జరిగిన రెండో టెస్టులో ఈ ఆల్ రౌండర్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. బ్యాటింగ్ లో 162 బంతుల్లో 104 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్‌లో అతని రెండవ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులకు 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మహిళల విభాగంలో, స్కాట్లాండ్ కెప్టెన్ కాథరిన్ బ్రైస్ ఏప్రిల్ నెలలో ఐసీసీ మహిళా క్రీడాకారిణిగా ఎంపికైంది.