చెట్టంత మెలానియా ట్రంప్‌!

చెట్టంత మెలానియా ట్రంప్‌!

ఇదిగో ఈ బొమ్మ ఎవరిదో తెలుసా? అమెరికా ఫస్ట్​ లేడీ, అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భార్య మెలానియా ట్రంప్​. ఆమె సొంతూరు స్లొవేనియాలోని సెవ్నికాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోజ్నో అనే గ్రామంలో చెట్టును తొలిచి ఆమె రూపునిచ్చారు. స్థానిక శిల్పి అలెస్​ జుపెవ్స్​అలియాస్​ మ్యాక్సీతో కలిసి అమెరికా ఆర్టిస్ట్​ బ్రాడ్​ డౌనీ ఆమె విగ్రహాన్ని ఇలా చెక్కారు. ఇంకో విషయమేంటంటే, మెలానియా పుట్టిన సంవత్సరం, నెల, తేదీలోనే మ్యాక్సీ కూడా పుట్టాడట. కానీ, విగ్రహాన్ని సరిగ్గా పరిశీలించండి.. అసలు ఆమె పోలికలు ఏమైనా ఉన్నాయా? ఉండవు.. ఎందుకంటే, ట్రంప్​ తీసుకుంటున్న వలస విధాన నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పేరడీగా ఆమె విగ్రహాన్ని చెక్కించారు కాబట్టి. దానికీ ఓ కారణముంది. అసలు అమెరికన్​ కాని, ఇంగ్లిష్​ రాని మెలానియాను ట్రంప్​ పెళ్లి చేసుకున్నారని, ఆమె కూడా వలసదారేనని డౌనీ చెబుతున్నాడు. కానీ, దానికి భిన్నంగా వలసదారులకు వ్యతిరేకంగా ఇమిగ్రేషన్​ విధానాలను ట్రంప్​ తీసుకొస్తున్నారని, అందుకే ఇలా ఆమె బొమ్మ చెక్కించామని చెప్పాడు. ఫస్ట్​ లేడీకి అంకితమిచ్చిన ప్రపంచంలోని తొలి ‘కట్టడం’ కూడా ఇదేనంటున్నాడు. మెలానియా చెట్టు బొమ్మను కొందరు నెటిజన్లు సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం ఏంటిది అని విమర్శలు గుప్పిస్తున్నారు. డౌనీ చేసింది కరెక్టేనని కొందరంటే, అసలు అంత అందమైన మెలానియాను ఇంత అసహ్యంగా చూపిస్తారా అంటూ మరికొందరు మండిపడుతున్నారు.