విశ్వాసం: మానసిక పరిశుభ్రత... అనవసరపు మాటల కంటే అచంచలమైన మనస్సు ప్రధానం

విశ్వాసం: మానసిక పరిశుభ్రత... అనవసరపు మాటల కంటే అచంచలమైన మనస్సు ప్రధానం

పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాట కన్న నెంచ మనసు దృఢము
కులము కన్న మిగులు గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భక్తి లేని దేవుని పూజల కంటే నిశ్చలమైన మంచి బుద్ధి కలిగి ఉండటం మంచిది. పైపై మాటలు చెప్పటం కంటే నిశ్చలమైన మనస్సు కలిగి ఉండటం మంచిది. వంశము యొక్క గొప్పతనము కంటే వ్యక్తి యొక్క మంచితనము ముఖ్యము. ఇంకా లోతుగా పరిశీలిస్తే... 

గురి కుదరని పైపై పూజ కంటే నిశ్చలమైన జ్ఞానం ముఖ్యం. అనవసరపు మాటల కంటే అచంచలమైన మనస్సు ప్రధానం. సామాజికంగా ఏర్పడిన కులం కంటే, స్వభావతః ఏర్పడిన లక్షణం ప్రధానం. ఏ పనినైనా త్రికరణశుద్ధిగా ఆచరించినట్లయితే అది భగవంతుని సేవతో సమానమని పెద్దలు చెబుతున్నారు. 

అంటే... భక్తితో కాకుండా, ప్రదర్శన కోసం చేసే పూజల వలన ఫలితం ఉండదు. అంతకంటే సద్బుద్ధితో ఇతరులకు సహాయం చేయటం మేలు. కొందరు ఎన్నో నీతులు పలుకుతుంటారు. మనసులో మాత్రం దురాలోచనలు కలిగి ఉంటారు. నీతులు పలకటం కంటే సదాలోచనలు కలిగి ఉండటం ఉత్తమం. 

జన్మతః సత్కులంలో పుట్టినప్పటికీ, సంస్కారం అలవడని వాని కంటే, ఏ కులంలో జన్మించినప్పటికీ, సంస్కారం కలిగినవాడే ఉత్తముడని వేమన చెబుతున్నాడు. కుమ్మరివాడైన కురువరతి నంబి ప్రసిద్ధి చెందిన భక్తుడవలేదా! అందుకే ఏ పని చేస్తున్నా, వాటి మూలాలను అనుసరిస్తున్నామా? లేదా? అని ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ పద్యం చెబుతోంది. ఇది పాత మాటే కావచ్చు. కానీ.. ఎప్పటికీ పాతపడని మాట అని గుర్తుంచుకోవాలి. 

ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల
భాండ శుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినురవేమ.

మానసిక శుద్ధి లేని ఆచరణ, పాత్ర శుద్ధి లేని వంటకం, చిత్తశుద్ధి లేని శివపూజ... అనవసరం అని కూడా వేమన చెబుతున్నాడు. ముఖ్యంగా సాటివారు ఆపదలో ఉంటే సహాయపడటం, అవసరంలో ఉన్నవారికి మాట సాయం చేయడం, మనిషినే భగవంతుని రూపంగా భావించటం వంటివి చేయాలని వేమన చెబుతున్నాడు.  ఇందుకు ఒక కథ ఉదాహరణగా కనిపిస్తుంది. 

అనగనగా ఒక ఊరిలో మహదేవయ్యగారు అనే అర్చకుడు ఉన్నాడు. ఆయన ప్రతిరోజూ తెల్లవారు జామునే... అభిషేకానికి కావల్సిన నీరు, నైవేద్యం తీసుకుని వెళ్లి, భగవంతుని పూజించి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఎప్పటిలాగే ఒకరోజు ఆయన తన కుమారుడిని తీసుకుని గుడికి బయలుదేరాడు. అభిషేకం, నైవేద్యం ఉంచిన పాత్రలను తన కుమారుడు చేత పట్టుకుని, తండ్రి వెనకాల నెమ్మదిగా నడుస్తున్నాడు. 

దేవుడికి నైవేద్యం పెట్టే, అభిషేకం చేసే సమయం దగ్గర పడుతుండటంతో మహదేవయ్యగారు వేగంగా నడుస్తున్నారు. మార్గమధ్యంలో ఒక బీదరాలు తన పసిబిడ్డతో కనిపించింది. ఆమెకు చాలా దాహంగా, ఆకలిగా ఉందని, రెండురోజులుగా ఏమీ తినలేదని ఆ కుర్రవాడితో పలికింది. చిన్నతనం నుండి ‘మానవ సేవే మాధవ సేవ’ అని తన తండ్రి చెప్పిన మాటలు ఆ కుర్రవాడికి గుర్తుకు వచ్చాయి. అంతే ఏ మాత్రం ఆలోచించకుండా...  అభిషేకం కోసం తీసుకెళ్తున్న నీటిని, నైవేద్యం కోసం సిద్ధం చేసిన ప్రసాదాన్ని ఆ తల్లికి ఇచ్చేశాడు. 

మహదేవయ్య గబగబ నడుచుకుంటూ వెళ్లి, ‘నాయనా! అభిషేక జలం, నైవేద్య పాత్ర ఇక్కడ ఉంచు’ అన్నాడు. కుమారుడు ఖాళీ పాత్రలు చూపాడు. మహదేవయ్యకు కోపం వచ్చి, పిల్లవాడిని దండించాడు. పిల్లవాడు ఏడుస్తూ, ‘నాన్నా! మీరే కదా, మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు’ అన్నాడు. తండ్రి మారు మాట్లాడకుండా గుడి తలుపులు తెరిచాడు. ఆశ్చర్యం, శివలింగం మీద అభిషేకం జరిగిన గుర్తులు, ప్రసాదపు జాడలు కనిపించాయి. అంతే! త్రికరణ శుద్ధిగా చేసిన పని భగవంతుని సేవతో సమానమని తెలుసుకున్నాడు. 


మహాభారతం అరణ్యపర్వంలో ధర్మవ్యాధుని కథ తెలిసిందే. సాక్షాత్తు కౌశిక మహర్షి, మాంసం అమ్ముకునే ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్లి ధర్మసూక్ష్మాలు తెలుసుకున్నాడు. సూత మహాముని శౌనకానిదిమునులకు మహాభారతగాథ వినిపించాడు. శంకర భగవత్పాదులకు ఎదురైన చండాలుడిలో సాక్షాత్తు పరమశివుడిని దర్శించాడు. కులము కన్న మిగులు గుణము ప్రధానంబు.. అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణలు కనిపించవు.

- డా. పురాణపండ వైజయంతి-