- పదేండ్ల కింద అదృశ్యమైన మతిస్థిమితంలేని మహిళ
- ఆచూకీ దొరక్క కర్మకాండలు పూర్తి చేసిన కుటుంబసభ్యులు
- మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చి ఆనందంలో ముంచేసిన కోటమ్మ
పినపాక, వెలుగు: మతిస్థిమితం లేని ఓ మహిళ పదేండ్ల కింద కనిపించకుండా పోయింది. ఆమె ఇంటికి తిరిగి రావడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లికి చెందిన మహిళ జల్లారపు కోటమ్మ మతిస్థిమితం కోల్పోవడంతో పదేండ్ల కింద కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె చనిపోయి ఉంటుందని భావించి గతేడాది కర్మకాండలు పూర్తి చేశారు.
కాగా.. ఆదివారం కోటమ్మను ఖమ్మం సిటీకి చెందిన అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు గ్రామానికి తీసుకెళ్లి కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే.. కోటమ్మ మహారాష్ట్రలోని నాగపూర్‌కు చేరగా.. అక్కడి పోలీసులు మెంటల్ఆస్పత్రిలో చేర్పించారు. కొన్నాళ్ల తర్వాత కోలుకున్నాక స్థానిక ఓ ఎన్జీవో సంస్థలో చేర్చారు.
నిర్వాహకులు కోటమ్మ తెలుగులో మాట్లాతుండగా ఆమె వివరాలు తెలిశాయి. దీంతో అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. నాగపూర్ వెళ్లి కోటమ్మను తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. శ్రీనివాసరావును ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
