హైదరాబాద్: గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా భారత్‌లో పర్యటిస్తోన్న ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ హైదరాబాద్ చేరుకున్నారు. శనివారం (డిసెంబర్ 13) ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి మెస్సీ నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్‌కు బయలుదేరి వెళ్లారు.
ఫలక్ నుమా ప్యాలెస్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ మీట్ అండ్ గ్రీట్ ఫొటో సెషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మెస్సీని దాదాపు 250 మందికి వరకు కలవనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్న మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నాడు.
కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ పాల్గొన్న కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో హైదరాబాద్ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. కేవలం పాసులు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. సాల్ట్ లేక్ స్టేడియంలో తరహాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు.. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

