మెట్రో, ఫార్మా సిటీ రద్దు చేయటం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

మెట్రో, ఫార్మా సిటీ రద్దు చేయటం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని తెలిపారు.  ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు.  శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.  BHEL నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుందని సీఎం  చెప్పారు.  

MGBS నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.  నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓఎస్ హాస్పిటల్  మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామని తెలిపారు.  మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు మెట్రో పొడిగిస్తామని తెలిపారు సీఎం. ఇక మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోనుఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు పొడిగిస్తామని రేవంత్ తెలిపారు.  

ఫార్మాసిటీని అంచలంచలుగా రింగ్ రోడ్,  రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు సీఎం.  అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకి  గృహనిర్మాణం కూడా ఉంటుందని తెలిపారు.  గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని సీఎం చెప్పారు.  యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం..  విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని తెలిపారు.  

జనవరి 3వ తేదీ నుంచి  పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని సీఎం తెలిపారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు.  పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పుకొచ్చారు.  ప్రెస్ అకాడమీ చైర్మన్ ను  భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు సీఎం.  ఇప్పటి నుంచి వంద రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు సీఎం.