ఫ్యూచర్ సిటీకి ఎయిర్ పోర్టు నుంచి మెట్రో

ఫ్యూచర్ సిటీకి ఎయిర్ పోర్టు నుంచి మెట్రో
  • ఓఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ కనెక్టివిటీ కూడా ఉండాలి  
  • ఫ్యూచర్ సిటీ రూట్ మ్యాప్ అభివృద్ధి చేయండి
  • అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండేలా రూట్ మ్యాప్​ను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్ రోడ్(ఆర్ఆర్ఆర్)తోనూ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్ల అభివృద్ధికి వీలుగా కూడా ప్లాన్​లు సిద్ధం చేయాలని సూచించారు. శనివారం జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో అధికారులతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రివ్యూ చేశారు. 

ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీపై సీఎంకు అధికారులు వివరించారు. రోడ్డు, మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. 

కాగా, ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఇప్పటికే ప్రముఖ కంపెనీలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఫాక్స్‌‌కాన్‌‌ చైర్మన్‌‌ యంగ్‌‌ లియూతో భేటీలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో కూడా పలు కంపెనీలకు సీఎం ఆహ్వానం పలికారు. అక్కడే పలు కంపెనీలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. ఫ్యూచర్ (ఫోర్త్) సిటీలో విద్య, వైద్యం, క్రీడలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ సహా పలు రంగాలను విస్తరించనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు.