40 నిమిషాల్లోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

 40 నిమిషాల్లోనే శంషాబాద్ ఎయిర్  పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ల వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఎయిర్ పోర్ట్ నుండి మీర్ ఖాన్ పేట్ లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మించనున్న మెట్రో కారిడార్ కు సంబంధించి డీపీఆర్ తయారీ కోసం సర్వే పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. 

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ సంస్థ HMDA, TGIICలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్ లను అభివృద్ధి చేసి, శంషాబాద్ ఎయిర్ పోర్ట్  నుంచి త్వరితగతిన సులభంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు మెట్రో ఎండీ.  ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే  మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది.. ఈ మార్గంలో మెట్రో వెళ్తే కేవలం 40 నిమిషాల్లోనే ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చన్నారు 

మెట్రో వల్ల హైదరాబాద్ ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెంది, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైద్రాబాద్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు మెట్రో ఎండీ. ఏ విధంగా అయితే ప్రపంచంలో ప్రప్రథమంగా 22 వేల కోట్ల రూపాయలతో మెట్రో మొదటి దశను 69 కిలోమీటర్ల మేర పీపీపీ పద్ధతిన విజయవంతంగా పూర్తి చేసామో, అదే విధంగా ఈ ప్రణాళికలను కూడా కార్యరూపం దాల్చేలా HMDA, TGIIC, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తాయని అన్నారు. 

నార్త్ సిటీ లోని మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లతో పాటు, ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ కూడా ఈ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పిస్తామని  తెలిపారు మెట్రో  ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.