ప్రభుత్వ పరిశీలనలో మెట్రో డీపీఆర్లు .. జేబీఎస్​ను ఇంటర్నేషనల్ హబ్​గామలిచేలా ప్లాన్: మెట్రో ఎండీ

ప్రభుత్వ పరిశీలనలో మెట్రో డీపీఆర్లు .. జేబీఎస్​ను ఇంటర్నేషనల్ హబ్​గామలిచేలా ప్లాన్: మెట్రో ఎండీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పార్ట్ (బీ) డీపీఆర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ డీపీఆర్‌‌లను మెట్రో బోర్డు మే 8, 2025న ఆమోదించిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు.  మెట్రో రైల్ సెకండ్ ఫేజ్- పార్ట్ (బి)లో భాగంగా మేడ్చల్, శామీర్‌‌పేట్, ఫ్యూచర్ సిటీ మార్గాలకు రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో 86.1 కి.మీ. పొడవైన కారిడార్‌‌లకు డీపీఆర్‌‌లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో జేబీఎస్‌‌ను ఇంటర్నేషనల్ హబ్‌‌గా మలిచేందుకు పలు కీలక అంశాలను డీపీఆర్‌‌లో చేర్చామన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కేంద్రానికి సమర్పించిన అనంతరం ఫుల్ డిటైల్స్ రిలీజ్ చేస్తామని గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సెకండ్ ఫేజ్ పార్ట్ (ఏ) డీపీర్లు కేంద్రానికి సమర్పించి ఆరునెలలు కావొస్తున్న ఆమోదం పొందలేదు. 

కారిడార్లు వివరాలు... 

జేబీఎస్ –- మేడ్చల్: 24.5 కి.మీ. పొడవు, 18 స్టేషన్లతో పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్‌‌గా నిర్మాణం.  
జేబీఎస్- – శామీర్‌‌పేట: 22 కి.మీ. పొడవు, 14 స్టేషన్లు. ఇందులో 20.35 కి.మీ. ఎలివేటెడ్, 1.65 కి.మీ. హకీంపేట ఏయిర్ పోర్టు సమీపంలో అండర్‌‌గ్రౌండ్ మార్గం.  
ఆర్జీఐఏ – ఫ్యూచర్ సిటీ: 39.6 కి.మీ. పొడవు. ఇందులో 1.5 కి.మీ. అండర్‌‌గ్రౌండ్, 21 కి.మీ. ఎలివేటెడ్, 17 కి.మీ. ఎట్-గ్రేడ్ మార్గం. శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్ నుంచి పెద్ద గోల్కొండ, రావిర్యాల మీదుగా స్కిల్ యూనివర్సిటీ వరకు విస్తరణ.