రెండు పార్ట్​లుగా మెట్రో ఫేజ్ ​3

రెండు పార్ట్​లుగా మెట్రో ఫేజ్ ​3
  • పార్ట్- ఏలో సిటీ నుంచి శివారు ప్రాంతాలకు: ఎన్వీఎస్ రెడ్డి
  • పార్ట్​-బీలో ఓఆర్ఆర్​ చుట్టూ..
  • రూ.69 వేల కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు.. పనులు ఎప్పుడు పూర్తయ్యేది చెప్పలేం 
  • అప్పట్లో ఓఆర్ఆర్, మెట్రోకు వైఎస్సార్ ఒప్పుకోలేదని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:మెట్రో ఫేజ్ 3లో పనులను రెండు భాగాలుగా చెపట్టనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్​రెడ్డి తెలిపారు. పార్ట్​‘ఏ’లో  సిటీ నుంచి శివారు ప్రాంతాలకు మెట్రో లైన్లు నిర్మించున్నట్లు చెప్పారు. పార్ట్​‘బీ’ లో ఔటర్ రిండ్​రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ చేపట్టనున్నట్లు వివరించారు. ఫేజ్​3లో మొత్తం రూ.69వేల కోట్లతో.. 309 కిలోమీటర్ల మేర నిర్మించనున్నట్లు తెలిపారు. అయితే ఈ పనులు ఎప్పుడు పూర్తయ్యేది చెప్పలేమని.. మెట్లో నిర్మాణానికి అవసమైన నిధుల సేకరణ ఎలా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మెట్రో విస్తరణ సోమవారం బేగంపేట్ లోని మెట్రో రైల్ భవన్ లో ఆయన మీడియాకు వివరించారు.

 ఫస్ట్ ఫేజ్ లో 69 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణం చేపట్టి సర్వీసులు కొనసాగిస్తున్నారు. ఫేజ్ 2లో రాయదుర్గం–-ఎయిర్ పోర్టు, బీహెచ్ఈఎల్-లక్డికాపూల్, నాగోల్–ఎల్బీనగర్, ఎంజీబీఎస్–-ఫలక్ నుమా మొత్తం 67.5 కిలోమీటర్లు, 42 స్టేషన్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. బీహెచ్ఈఎల్–-లక్డీకాపూల్, నాగోల్-–ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్​గా రూ.9100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వీటి నిర్మాణాలకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తామన్నారు.

పార్ట్​‘ఏ’లో 142 కి.మీ., 68 స్టేషన్లు
పార్ట్ ‘ఏ’ లో సిటీ నుంచి శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ వచ్చేలా 8 స్ట్రెచ్​లుగా 142 కిలోమీటర్లు, 68 స్టేషన్లతో మెట్రో లైన్​ను రూ.39,190 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేసినట్లు తెలిపారు. ఇందులో రూ.3250 కోట్లతో బీహెచ్ఈఎల్ నుంచి పటాన్ చెరు ఓఆర్ఆర్ మీదుగా ఇస్నాపూర్ వరకు 13 కిలోమీటర్లు, రూ.3250 కోట్లతో ఎల్బీనగర్–హయత్ నగర్–పెద్ద అంబర్ పేట్ వరకు 13 కిలోమీటర్లు, రూ.6800 కోట్లతో శంషాబాద్– కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకు 28 కిలోమీటర్లు, రూ.6900 కోట్లతో ఉప్పల్ ఔటర్ రింగ్ రోడ్– ఘట్కేసర్–బీబీనగర్ వరకు 25 కిలోమీటర్లు, రూ.6600 కోట్లతో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తుక్కుగూడ ఓఆర్ఆర్, మహేశ్వరం మీదుగా కందుకూరు వరకు 26 కిలోమీటర్లు, రూ.2300 కోట్లతో తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్లు, రూ.5690 కోట్లతో జేబీఎస్ నుంచి తూముకుంట వరకు 17 కిలోమీటర్ల మార్గంలో డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్,  రూ.4400 కోట్లతో పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు 12 కిలోమీటర్ల మేరా డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు.

నాలుగు చోట్ల ఔటర్ బయటకు మెట్రో
ఫేజ్​–3 పార్టు బీ లో రూ.20,810 కోట్లతో 136 కిలోమీటర్లు, 13 స్టేషన్లతో నిర్మించేందుకు ప్రపోజల్స్ సిద్ధం చేశామని ఎన్వీఎస్​రెడ్డి చెప్పారు. ఇందులో రూ.5600 కోట్లతో 40 కిలోమీటర్లు, 5 స్టేషన్లతో ఓఆర్ఆర్ శంషాబాద్ నేషనల్ హైవే–44 నుంచి తక్కుగూడ, బొంగుళూర్, పెద్ద అంబర్ పేట్ నేషనల్ హైవే–65 వరకు ఒక కారిడార్, రూ.6750 కోట్లతో ఓఆర్ఆర్ పెద్ద అంబర్ పేట్ నేషనల్ హైవే–65 నుంచి ఘట్ కేసర్, శామీర్ పేట్, మేడ్చల్ నేషనల్ హైవే–44 వరకు మరో కారిడార్, రూ.4785 కోట్లతో 45 కిలోమీటర్లు, 5 స్టేషన్లతో ఓఆర్ఆర్ మేడ్చల్ నేషనల్ హైవే–44 నుంచి దుండిగల్, పఠాన్ చెరువు నేషనల్ హైవే–45 వరకు మూడో కారిడార్ ఉండగా, రూ.3675 కోట్లతో 22కిలోమీటర్లు,3 స్టేషన్లతో ఓఆర్ఆర్ నేషనల్ హైవే 65 నుంచి కోకాపేట్, నార్సింగి వరకు నాలుగో కారిడార్ నిర్మించనున్నట్లు తెలిపారు. 

రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకి నిర్మిస్తున్న మెట్రోని కలిపితే ఓఆర్ఆర్ పై మొత్తం 156 కిలోమీటర్ల మేర మెట్రో ఉంటుందని, గచ్చిబౌలి నుంచి నార్సింగి వరకు 2 కిలోమీటర్లు మినహా ఓఆర్ఆర్ అంతటా మెట్రో ఉంటుదన్నారు. ప్రస్తుతం మెట్రో లో డైలీ ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారని, వచ్చేఏడాది వరకు ఏడు లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు.

ఓఆర్​ఆర్, మెట్రో.. ఊహలన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి
హైదరాబాద్​లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడం కోసం 2002లో కొలంబియాలోని బగోటా సిటీ వెళ్లి బీఆర్టీఎస్​పై స్టడీ చేశామని ఎన్సీఎస్ రెడ్డి తెలిపారు. ఆ సిటీ మేయర్​ను తీసుకొచ్చి అప్పటి సీఎం వైఎస్సార్​తో కలిపించామన్నారు. దానిపై 6 నెలలు పని చేశామని.. కానీ అది సాధ్యంకాదని నిర్ణయించి ప్రత్యామ్నాయం ఆలోచించామన్నా రు. అప్పుడు ఓఆర్ఆర్,​ మెట్రో ప్రాజెక్టుల గురించి చెబితే వైఎస్​కు చెప్తే అవన్నీ ఊహలే అని అన్నారన్నారు. ఆయనను ఒప్పించి 2007లో మెట్రో పనులు స్టార్ట్ చేశామని చెప్పారు. ఇప్పుడు మెట్రో, ఓఆర్ఆర్ దేశంలోనే గొప్పగా డెవలప్​ అయ్యాయి. సీఎం కేసీఆర్ గొప్ప విజన్ తో ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో ప్రాజెక్టు విస్తరిస్తున్నారు.