హైదరాబాద్ మెట్రో ఉద్యోగులకు నారాశే

 హైదరాబాద్ మెట్రో ఉద్యోగులకు నారాశే

మెట్రో రైల్ సిబ్బందికి మరోసారి నిరాశే ఎదురైంది. జీతాల పెంపుపై ఇప్పటి వరకూ అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రూ.3 లేదా 4 వందల రూపాయలు మాత్రమే పెంచుతామని అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. ఇప్పటివరకూ సరైన రెస్పాన్స్ రాకపోవడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పని చేస్తే చేయండి లేదంటే లేదు అని చెప్పడం బాధగా అనిపిస్తోందని ఉద్యోగులు తమ దీనస్థితిని వెల్లడిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం కాకుంటే లేబర్ కమిషనర్ కు వెళ్తామని ఉదయం చెప్పిన ఉద్యోగులు... ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయకుండా మెట్రో టికెటింగ్ ఉద్యోగులు అక్కడినుంచి వెళ్లిపోయారు.

అధికారుల స్పందనతో ఉప్పల్ డిపో నుంచి మెట్రో టికెటింగ్ ఉద్యోగులు నిరాశగా వెను తిరిగినట్టు తెలుస్తోంది. కాగా తర్వాతి కార్యాచణపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఉద్యోగుల నిరసనపై సందిగ్ధత నెలకొంది. గత 2 రోజుల నుంచి జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. మెట్రోలో తమకు ఉచిత ట్రావెలింగ్, వసతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా జీతం రూ. 11 వేల నుంచి రూ. 20 వేలకు పెంచాలని కోరుతున్నారు. గత 5ఏళ్లుగా  జీతాలు పెంచడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలీ చాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని, ఉద్యోగాల విషయంలోనూ తమకు చాలా సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. ఒకరు ఉద్యోగం చేస్తుంటే మరో రిలీవర్ సరైన సమయానికి రాకపోయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదని వాపోతున్నారు.